English | Telugu
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు పై ఛార్జ్ షీట్ దాఖలుకు కేంద్రం ఆదేశం
Updated : Mar 7, 2020
చీఫ్ సెక్రెటరీ కి లేఖ రాసిన కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ
ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏ బీ వెంకటేశ్వర రావు వ్యవహారం శనివారం మరో మలుపు తిరిగింది. అనూహ్యం గా , కేంద్ర హోమ్ శాఖ...రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తూ, ఏ బీ వీ పై ఏప్రిల్ 7 లోగా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా, ఏ బీ వెంకటేశ్వర రావు ను సస్పెండ్ చేస్తూ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోమ్ శాఖ ఖరారు చేసింది. ఏ బీ వీ తప్పిదాలకు పాల్పడినట్టుగా ప్రాధమిక ఆధారాలు లభ్యమైనట్టు, ఏరోసాట్, యు వీ ఏ ల కొనుగోలు కోసం వెచ్చించిన 25. 5 కోట్ల రూపాయల వ్యవహారం లో భారీ అక్రమాలు జరిగినట్టు కేంద్ర హోమ్ శాఖ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారం తో, ఆంద్ర ప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే, ఏ బీ వీ వ్యవహారం ఈ స్థాయి వరకూ వెళ్తుందని ఎవరూ ఊహించకపోవటం ఒక కారణమైతే, రాష్ట్ర ప్రభుత్వం ఏ బీ ఎపిసోడ్ లో తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేయటం ద్వారా -చంద్రబాబు నాయుడు తో స్నేహానికి తాము సిద్ధంగా లేమనే సంకేతాన్ని కేంద్రం పంపించినట్టయిందని విశ్లేషకులు అంటున్నారు.
నిరుడు ఎన్నికల నిర్వహణలో అక్రమాలకూ పాల్పడుతున్నారంటూ --ఏబి వెంకటేశ్వర రావు పై వైసిపి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన విషయం అందరికీ తెలిసిందే . ఫలితంగా ఆయన్ను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ ఎన్నికల సంఘం ఆదేశించింది. టిడిపి ప్రభుత్వం లో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబి వెంకటేశ్వర రావు పై చాలా కాలంగా వైసిపి దృష్టి సారించింది. అందునా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఏబి వెంకటేశ్వర రావు పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. నంద్యాల ఎన్నికల సమమం నుండి నిరుడు సాధారణ ఎన్నికల వరకూ ఏబి వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు కు మద్దతుగా పార్టీ నేతగా పని చేస్తున్నారనేది వైసిపి నేతల ఆరోపణ. ఇక, నిరుటి ఎన్నికల సమయంలో టిడిపి కోసం ఇంటలిజెన్స్ చీఫ్ అనైతికంగా వ్యవహరిస్తున్నారంటూ వైసిపి నేతలు నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. దీంతో..ఇంటలిజెన్స్ చీఫ్ ను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనిని నిరసిస్తూ ఏపి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు సైతం ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేయటంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను రిలీవ్ చేసింది.
ఆధార్ సంస్థ చేసిన ఫిర్యాదు పై స్పందనగా మాట్లాడిన విజయ సాయిరెడ్డి ఏపిలో ఇప్రగతి ప్రాజెక్టు పేరుతో ఆధార్ సమాచారం మొత్తం సేకరించారని.. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టు డిజిపి ఠాకూర్ తో పాటుగా ఇంటలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన ఏబి వెంకటేశ్వరరావు సంబంధీకులు దక్కించుకున్నారని చెప్పుకొచ్చిన విజయ సాయిరెడ్డి సరైన సమయంలో వివరాలను బయట పెడతానని చెప్పారు. దీని పై స్పందించిన ఏబి వెంకటేశ్వర రావు తమకు ప్రభుత్వం లో ఎటువంటి కాంట్రాక్టులు..ఒప్పందాలు లేవని స్పష్టం చేసారు. తన పై హేయమైన వ్యాఖ్యలు చేసిన విజయ సాయిరెడ్డి పై పరువు నష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేసారు.
ఇటీవల జరిగిన పరిణామాల్లో... రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాల ఆరోపణల మీద ఏ బీ వీ ని సస్పెండ్ చేయటం, దాని మీద ఆయన క్యాట్ ను ఆశ్రయించటం, తర్వాత క్యాట్ ఆయన సస్పెన్షన్ ను సమర్ధించటం అందరికీ తెలిసిన విషయాలే. ఇప్పుడు తాజాగా..నేరుగాకేంద్ర హోమ్ శాఖ రంగం లోకి దిగటం బట్టి చూస్తుంటే, వై సి పీ , బీ జె పీ ల మధ్య ఒక అవగాహన దాదాపుగానే కుదిరిందని, ఇక తెలుగు దేశం మద్దతుదార్లయిన ఆఫీసర్లకు గడ్డు కాలం తప్పదనీ సంకేతాలు వస్తున్నాయి.