English | Telugu
700 మిలియన్ డాలర్ల కంపెనీ 10 వేల కోట్లు పెట్టుబడి పెడుతుందట!
Updated : Mar 7, 2020
వంద మంది సిబ్బంది దాటని కంపెనీ, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఒప్పందం చేసుకోవడం విడ్డూరం కాదా ....
రాష్ట్రానికి భారీ పెట్టుబడి పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేసిన హడావుడి వెనుక డొల్లతనం ఒక్కసారిగా బయటపడింది. వైయస్సార్ కడప జిల్లాలో మరో స్టీల్ ప్లాంట్‌పై ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ ఐఎంఆర్ ప్రతిపాదన చేసిందనీ, ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం గా ఈ ప్లాంట్ పని చేస్తుందనీ, రూ. 12వేల కోట్లకుపైగా పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందనీ రాష్ట్ర ప్రభుత్వం పటాటోప ప్రదర్శన చేసింది. ముఖ్యమంత్రి వైయస్.జగన్‌తో చర్చలు జరిపిన ఈ స్విస్ కంపెనీ -ఐ ఎం ఆర్ ఏ జీ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఎదుట వైయస్సార్‌జిల్లాలో ప్లాంట్ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తంచేశారు. 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం ఈ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో ఐఎంఆర్‌కంపెనీ ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఐఎంఆర్ కంపెనీ కార్యకలాపాలను సీఎం అడిగితెలుసుకున్నారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నడుతున్నామంటూ వారు వివరించారు. ఇది వారి వివరణ అయితే, వాస్తవానికి ఆకంపెనీ ప్రొఫైల్ వేరే విధం గా ఉంది. 2001 లో స్విట్జర్లాండ్ లో ఏర్పాటైన ఈ కంపెనీ కార్యకలాపాలు- డెవెలప్మెంట్ కన్సల్టింగ్, సర్వీస్ ప్రొవైడర్లుగా మాత్రమే పరిమితం కాగా, ఇనుప ఖనిజం, బంగారం తవ్వకాల్లో తాము నిష్ణాతులమని ప్రకటించుకోవటమే ఇక్కడ పలు అనుమానాలకు తావిస్తోంది.
వైయస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు చెప్పుకొచ్చిన ఆ కంపనీ ప్రతినిధులు - ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామంటూ వారికి వివరించారు. ఐఎంఆర్ కూడా మరొక స్టీల్‌ప్లాంట్ పెడితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుందని సీఎం అన్నారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు. కృష్ణపట్నం పోర్టు, అక్కడ నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మంచి రవాణా సదుపాయం ఉందని సీఎం వారికి వివరించారు. పరిశ్రమల రాకవల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందంన్నారు. రానున్నరోజుల్లో వైయస్సార్ జిల్లా ప్రాంతం స్టీల్‌సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలున్నాయని ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఇదంతా కూడా ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షం లో జరిగిన చర్చల సారాంశం అయితే, వాస్తవమేమిటంటే ఆ కంపెనీ సిబ్బంది సామర్ధ్యం కూడా వంద మందికి మించి లేదు. 700 మిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న ఈ కంపెనీ, ఇప్పుడు రాష్ట్రం లో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి సామర్ధ్యం తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటం ఏ మేరకు లాజిక్ కు అందుతుందనేది ఇపుడు పారిశ్రామిక వర్గాల ప్రశ్న. వినే వాడు అమాయకుడు అయితే , చెప్పేవాడు విజయసాయి రెడ్డి అన్నట్టు--హఠాత్తుగా తెర మీదకు వచ్చిన ఈ స్విస్ కంపెనీ తెర వెనుక డొల్ల తనం బయటపడటం తో ...సర్కారీ పెద్దలు ప్రస్తుతం తలలు పట్టుక్కూర్చున్నారు.