English | Telugu
వైసీపీ ఎస్సీ ఎంపీ, ఎమ్మెల్యేలపై అనర్హత అస్త్రం... రాష్ట్రపతి ఆదేశాలతో కదులుతోన్న డొంక...
Updated : Nov 6, 2019
ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీకి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవే కారణమనే ప్రచారం జరుగుతోంది. వినాయకచవితి రోజు జరిగిన ఒక గొడవలో తనను కులం పేరుతో దూషించారని ఆమె ఫిర్యాదు చేయడం, తూళ్లూరు పోలీసులు ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడంతో... బాధితులు... జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఉండవల్లి శ్రీదేవి అసలు ఎస్సీ హిందువు కాదని, ఆమె క్రిస్టియన్ అంటూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. దాంతో, ఉండవల్లి శ్రీదేవి... హిందువో... క్రిస్టియనో... తేల్చాలంటూ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎల్వీ సుబ్రమణ్యానికి ఆదేశాలు వచ్చాయి. అయితే, ఉండవల్లి శ్రీదేవి... క్రిస్టియన్ కాదు... హిందువు అంటూ రిపోర్ట్ ఇవ్వాలంటూ సీఎంవో నుంచి ఒత్తిడి వచ్చిందని, దానికి ఎల్వీ ఒప్పుకోకపోవడంతో... ఆకస్మిక బదిలీ చేశారనే ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ దళిత క్రిస్టియన్ వివాదం ఎప్పట్నుంచో ఉంది. ఎస్సీలు... క్రైస్తవ్యంలోకి వెళ్తే... వాళ్లు రిజర్వేషన్లను కోల్పోతారని, వాళ్లు బీసీ-సీగా పరిగణించబడతారని రాజ్యాంగం చెబుతోంది. అమెండ్-మెంట్ 1950 పేరా 3లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, ఎస్సీలు.... క్రైస్తవ్యాన్ని స్వీకరించి.... క్రైస్తవ సంప్రదాయాల ప్రకారమే అన్ని కార్యక్రమాలను బహిరంగంగానే చేస్తున్నప్పటికీ... సర్టిఫికెట్స్ ప్రకారం మాత్రం ఎస్సీలుగా కొనసాగుతున్నారు. దీనిపై దళితుల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్రైస్తవ్యంలోకి మారినవాళ్లు... ఎస్సీ హోదాను వదులుకోకపోవడంతో.... నిజమైన దళితులకు అన్యాయం జరుగుతుందనే పోరాటాలూ జరుగుతున్నాయి.
అయితే, ఇఫ్పుడు తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి... హిందువా? లేక క్రిస్టియనా? తేల్చాలంటూ ఏకంగా రాష్ట్రపతి కార్యాలయం నుంచే సీఎస్ కు ఆదేశాలు రావడంతో.... తేనెతుట్టెను కదిపినట్లయ్యింది. ఎందుకంటే, ఉండవల్లి శ్రీదేవి... తాను క్రిస్టియన్ అని చెప్పుకోవడం... చర్చికి వెళ్లడం... ఇంట్లో కార్యక్రమాలను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేయడం... ఇలా ఎన్నో ఆధారాలు ఉండటంతో... ఒకవేళ ఆమె క్రిస్టియన్ అంటూ రాష్ట్రపతికి నివేదిక ఇస్తే.... శాసనసభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదముంది. అదే జరిగితే, ఇది ఒక్కరితోనే ఆగిపోదు... ఎందుకంటే... ఒక్క తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవే కాదు.... స్వయంగా హోంమంత్రి మేకతోటి సుచరితే... తన కుమార్తె వివాహాన్ని... క్రైస్తవ సంప్రదాయం ప్రకారం చేశారు. అందుకు పెళ్లి వీడియోలే రుజువు. ఇలా చెప్పుకుంటూ పోతే... ఎస్సీ కోటాలో ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల్లో అధిక శాతం క్రైస్తవులుగానే ఉన్నారనేది బహిరంగ సత్యం. ఒకవేళ కులం వివాదంలో తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు పడితే... అది మిగతా ఎస్సీ ప్రజాప్రతినిధులపైనా పడటం ఖాయం. ఎందుకంటే అట్రాసిటీ కేసులు, మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న హిందూ సంస్థలు, కొన్ని వర్గాలు.... ఆయా ఎస్సీ ప్రజాప్రతినిధుల క్రైస్తవ మూలాలపై ఆధారాలు సేకరించి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరి, ఈ దళిత క్రిస్టియన్ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.