English | Telugu

అంతటా ఉత్కంఠ :- నేడు ఆర్టీసీ సమ్మెపై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు



ఆర్టీసీ సమ్మె ఒక కోలోక్కి రానుందా.. లేక ఈ సాగతీత తప్పదా? ఈ రోజు ( నవంబర్ 18న ) జరిగే విచారణపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. 5 వేలకు పైగా బస్సులను ప్రైవేటీకరణ చేస్తామన్న పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. తాజాగా ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన ఫైనల్ అఫిడవిట్ పిటిషన్ తో ఆగ్రహించిన కార్మికులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ వాదన వినిపించనున్నారు.


తాత్కాలికంగా పరిష్కారం కోసం విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టినా.. కార్మికులు ఏ క్షణంలోనైనా మళ్లీ విలీన ప్రతిపాదనతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు సునీల్ శర్మ. జేఏసీ నేతలు విపక్షాలతో కలిసి కుట్రపూరితంగా సమ్మె చేస్తున్నారని.. ప్రభుత్వాన్ని అగౌరవపరిచేలా ఈ సమ్మె చేస్తున్నందున చర్చలు జరపడం కుదరదని అఫిడవిట్‌లో తెలపడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేశారు జేఏసీ నేతలు. ఎన్నటికైనా ప్రభుత్వం దిగి వచ్చి కార్మికులతో చర్చలు జరిపేంత వరకు సమ్మెను కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.


మరోవైపు.. నిరాహార దీక్ష చేస్తున్న జేఏసీ నాయకులను అరెస్టు చేయడంతో కార్మికుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. నిరాహారదీక్ష చేస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని నిన్న ( నవంబర్ 17న ) పోలీసులు అరెస్ట్ చేశారు చేశారు. రెండవ రోజు దీక్ష అయినందున..ఆరోగ్యం క్షీణిస్తుండటంతో దీక్ష విరమించుకోవాలని వైద్యులు సూచించారు. అశ్వత్థామరెడ్డి అందుకు నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేసి.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌ రాజిరెడ్డిని కూడా..ఇంటి తలుపులు పగలగొట్టి.. బయటకు తీసుకొచ్చి.. పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొత్తనికి సమ్మెపై హైకోర్టు తీర్పును వెలువరిస్తుందా.. లేక మళ్లా వాయిదా వేస్తుందా అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది.