English | Telugu

శ్రీ వారి లడ్డు ధర పెంచడం లేదు.. అద్దె గదుల గురుంచి త్వరలో ప్రకటిస్తాం :- టీటీడీ చైర్మన్ వైవి సుబ

శ్రీవారి లడ్డు ధర పెంపు పై టీటీడీ వెనకడుగు వేసింది. ధరలు పెంచడం లేదంటూ స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఇది వరకు రూ.50 రూపాయలకు భక్తులు కొనుగోలు చేసే లడ్డు విషయంలో రేటు పెంచడమో లేదా ఇది వరకు ఇచ్చే కొలతలో కొన్ని గ్రాములను తగ్గించి ఇవ్వాలన్న ప్రతిపాదన ఉండింది. కానీ ఆ నిర్ణయం తీసుకుంటున్నట్లు బయటకు రావడం మొదలు.. ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో టీటీడీ వెనుకంజ వేసిందనే అంటున్నారు భక్తులు.

ఇదిలా ఉంటే వసతి గృహాల అద్దె కూడా పెంచుతామని.. రూ.50 , రూ.100 రూపాయల అద్దె ఉన్న వసతి గృహాలను ఏకంగా తీసేయాలని బోర్డు కమిటీ సమావేశంలో చర్చింకున్నట్లు తెలిసిందే. ఇక చెన్నైలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం తమిళనాడు ప్రభుత్వం స్థలం కేటాయించిందని తెలిపారు వైవీ సుబ్బరెడ్డి. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలు భక్తులను నివ్వెర పరుస్తున్నాయి. బోర్డు మెంబర్ల నియామకం దగ్గర నుండి కొంతమంది అధికారులను.. అర్చకులను తొలగించడం.. అన్యమత ఉద్యోగులు తిరుమలలో ఉండటం.. లడ్డు వివాదం.. చివరకి తక్కువ ధర అద్దె గదులను తొలగించడం వరకు ప్రతి విషయంలో ఏదో ఒక వాగ్వాదం చోటు చేసుకుంటూనే ఉంది.

ఈ విషయంపై మాట్లాడిన విపక్షాలకు కొడాలి నాని చాలా ఘాటుగా స్పందించారు. తిరుమల ఏమైనా మీ అబ్బ సొత్తా అంటూ ప్రశ్నించారు. ఆరు నెలల్లోనే ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తే ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులను ఎదురుకోవాలిసి వస్తుందోనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.