English | Telugu
కేంద్రం ఆమోదం.. నచ్చకపోతే ఆరవ నెలలో కూడా అబార్షన్ చేసుకోవచ్చు
Updated : Jan 30, 2020
మహిళా హక్కులు , భ్రూణ హత్యలు రెండూ వేరు వేరు అనే అంశంపై కేంద్రం మొదటి వాదనకే కట్టుబడి ఉంది. దీంతో ఓ మహిళ తన ఆరు నెలల గర్భాన్ని కూడా తొలగించుకునేలా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో అబార్షన్ల విషయంలో ఇప్పటి దాకా ఉన్న 20 వారాల గడువు నుంచి 24 వారాలకు పెరగనుంది. ఇది కేవలం మహిళలకు తమ పునరుత్పత్తి పై పూర్తి హక్కులను కలిగించే దారిలో ఓ సంస్కరణగా మాత్రమే కేంద్రం చెబుతోంది.
స్త్రీల నుంచి డాక్టర్ల నుంచి ఈ రకమైన డిమాండ్ వచ్చిందని కేంద్రం చెబుతోంది. మహిళల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇప్పటి దాకా గర్భం దాల్చిన 20 వారాల తరువాత అబార్షన్ చేయడం నేరమే అని చట్టం చెబుతోంది. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన తరువాత ఆడశిశువులను పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడమే ఇందుకు కారణం. చట్టం ఏం చెప్పినా వాస్తవంలో మాత్రం భ్రూణహత్యలు ఆగడం లేదు. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర మహిళా హక్కుల పేరుతో అబార్షన్లకు 24 వారాల వరకు గడువు పెంచడం కొంత చర్చకు దారి తీసింది. అలా చేస్తే తల్లి ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. కానీ జన్మించే శిశువు ఎదుగుదలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అబార్షన్ ను చేయించడం తప్పని సరి అవుతుంది. అలాంటప్పుడు 20 వారాల గడువు అలాంటి అబార్షన్లకు అడ్డంకిగా మారేది. ఇప్పుడు కేంద్రం చట్టానికి సవరణ చేయడంతో 24 వారాలు అంటే ఆరు నెలలు అయినా అవసరాన్ని బట్టి గర్భ విచ్ఛిత్తికి చట్ట పరంగా కూడా వీలు చిక్కనుంది. అయితే దీనికి పార్లమెంటులో ఆమోదం దక్కాల్సి ఉంది.