English | Telugu
కూటమిలో పవన్ సొంత అజెండా?
Updated : Dec 14, 2025
అమరావతి వేదికగా తాజాగా జరిగిన రెండు సమావేశాలు.. రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఓ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగితే.. మరో సమావేశం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగింది. అదేంటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి ఉపముఖ్యమంత్రి, ఐదు శాఖల మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ హాజరవ్వాలి కదా? పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? అనే అనుమానాలు మీకు కలగవచ్చు... మీకే కాదు.. కూటమిలో ఉన్న నేతలతో పాటు రాజకీయ నాయకులకు ఇదే అనుమానం కలుగుతోంది.
అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అన్ని శాఖల హెచ్‌ఓడీలు, కార్యదర్శులు , మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17, 18 తేదీల్లో జరగబోతున్న కలెక్టర్స్ కాన్ఫిరెన్స్ కి కర్టెన్ రైజర్ గా జరిగింది ఈ సమావేశం. పరిపాలకు సంబంధించినటు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇలాంటి కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎన్డీఏలో అత్యంత యాక్టివ్‌గా కనిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారన్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వేగంగా విస్తరిస్తోంది. మొదటి రోజుల్లో జరిగిన ప్రతి ముఖ్య సమావేశానికి స్వయంగా హాజరై, ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందున్న జనసేనాని, ఇటీవల మాత్రం కీలక అధికారిక ఈవెంట్స్‌కి కూడా హాజరుకాకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ముఖ్య మీటింగ్‌లకు కూడా పవన్ డుమ్మా కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అమరావతిలోనే ఉన్నప్పటికీ...సీఎం చేపట్టే అత్యావశ్యక కార్యక్రమాలకు వెళ్లకుండా, ఆయన సొంత షెడ్యూల్‌ని ఫాలో అవుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఎస్ఐబీపీ సమావేశాలు, విశాఖ ఇండస్ట్రియల్ సమ్మిట్, సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం, రాజధాని ప్రాజెక్టుల రివ్యూ, పెన్షన్ల పంపిణీ వంటి ప్రభుత్వ ముఖ్య వేడుకలు, మీటింగ్‌లు, లాంచింగ్‌లు.. వీటి వేటిలోనూ పవన్ కనిపించకపోవడం చిన్న విషయం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి భాగస్వామ్యంలో ఇలాంటి గ్యాప్… ముఖ్య కార్యక్రమాల్లో పవన్ కనిపించకపోవడం… సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అన్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందంటున్నారు.
అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ వాంటెడ్ గా చేస్తున్నారా? లేక ముందస్తుగానే షెడ్యూల్ అయిన కారణంగానే సీఎం సమావేశానికి హాజరు కాలేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తుంది. అంతే కాదు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పాలనలో తన ఇమేజ్‌ని పెంచుకోవాలని భావిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక పార్టీ అధినేతగా విడివిడిగా సమావేశాలు పెట్టుకోవడం ద్వారా.. దాని ఇంపాక్ట్ క్యాడర్ మీద కూడా పడే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కూటమి సభల్లో మూడు పార్టీల కార్యకర్తలు కలిసి ఉండాలని, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని... కార్యకర్తలు, నేతల ప్రవర్తన కారణంగా కూటమి ఐక్యతను దెబ్బతీయొద్దంటూ పదేపదే చెబుతున్న పవన్ కళ్యాణ్.... ఆచరణలో తాను స్వయంగా ఎందుకు ఫాలో కావట్లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కారణాలు ఏమైనా గానీ.. పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశాలు పెట్టుకోవడం.. కూటమి కలిసి చేస్తున్న కార్యక్రమాలకు హాజరు కాకపోవడం వల్ల నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ వినపడుతోంది. పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కీలకమైన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎంగా ఉన్న మల్లు భట్టి విక్రమార్క కచ్చితంగా పాల్గొంటున్నారు.. కర్ణాటకలోనూ ఇదే తరహా వాతావరణం కనిపిస్తోంది. కానీ ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి సమావేశాలకు, కూటమి నిర్వహించే సమావేశాలకు పవన్ దూరంగా ఉండడం వెనుక మతలబు ఏంటో జనసేన నాయకులే చెప్పాలంటున్నారు. మొత్తానికి తాజాగా జరిగిన హెచ్ఓడీలు, సెక్రటరీల సమావేశానికి పవన్ రాకపోవడం.. అమరావతి లోనే తన శాఖకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడం వెనుక మతలబు ఏంటనే దానిపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.