English | Telugu
టీడీపీ-వైసీపీ ఎంపీల లొల్లి.. విజయసాయికి క్లాస్ పీకిన రాజ్‌నాథ్ సింగ్!!
Updated : Jan 30, 2020
ఏపీ రాజధానిపై వైసీపీ-టీడీపీ పార్టీల మధ్య జరుగుతోన్న మాటల యుద్ధం దేశ రాజధాని ఢిల్లీలో కూడా కొనసాగింది. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశంలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏపీ రాజధాని మార్పు, శాసనమండలి రద్దు అంశాలను పార్లమెంట్‌లో చర్చించాలని టీడీపీ ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని మార్పు రాష్ట్రానికి సంబంధించిన అంశమని విజయసాయి అన్నారు. అయితే టీడీపీ ఎంపీలు మాత్రం అప్పుడు తాము కేంద్రంతో సంప్రదించిన తర్వాతే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని గుర్తుచేశారు.
ఇలా మాట మాట పెరిగి.. ఇరు పార్టీల నేతల మద్య వాదన తీవ్రస్థాయికి చేరింది. దీంతో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కల్పించుకుని.. వైసీపీ ఎంపీలకు క్లాస్ పీకారని తెలుస్తోంది. టీడీపీ ఎంపీల అభిప్రాయాలను ఎందుకు అడ్డుకుంటున్నారని రాజ్‌నాథ్ ప్రశ్నించారు. వారు ప్రస్తావన మాత్రమే తీసుకువచ్చారని.. సభలో చర్చించాలా లేదా అనేది తర్వాత నిర్ణయిస్తామన్నారు. ఇది కేవలం చర్చపై జరుగుతున్న సమావేశం మాత్రమేనని.. చర్చించే అంశాలపై ఇలా గొడవకు దిగడం సరికాదని రాజ్‌నాథ్ హితవు పలికారు. దీంతో ఎంపీలు సైలెంట్ అయ్యారు.