English | Telugu

బీ కేర్ ఫుల్.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్

చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోంది. కొత్తగా 1700 లకు పైగా కేసులు నమోదైనట్లు చైనా హెల్త్ కమిషన్ ప్రకటించింది. వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 170కి పెరిగింది. అంచనాలకు అందని విధంగా వైరస్ వ్యాపిస్తుండంతో చైనా సర్కారు సైన్యాన్ని రంగంలోకి దించింది. మరోవైపు అక్కడి భారతీయులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. చైనాలో కరోనా వైరస్ కాటు రోజురోజుకు పెరుగుతోంది. వైరస్ విస్తృతి టిబెటును తాకింది. టిబెట్ లో తొలి వైరస్ కేసు నమోదైంది. మరో 38 మంది మరణించడంతో మృతుల సంఖ్య 170 కి చేరింది. కొత్తగా మరో 1700 కేసులు నమోదు కాగా మొత్తం వైరస్ సోకిన బాధితుల సంఖ్య 7,711 కు చేరింది. వారిలో 1370 మంది పరిస్థితి క్లిష్టంగా ఉంది. మరో 12,167 మందికి కూడా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న చైనా హెల్త్ కమిషన్ వెల్లడించింది. కరోనా వైరస్ ను భూతంతో పోల్చిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వైరస్ లు నియంత్రించాల్సి ఉందన్నారు. సమయానుసారం వైరస్ సమాచారాన్ని తమ ప్రభుత్వం పారదర్శకంగా అందిస్తుందని తెలిపారు. వైరస్ తీవ్రత భయంకర స్థాయిలో ఉండడంతో చైనా సర్కారు సైన్యాన్ని రంగంలోకి దించింది.

మరోవైపు భారత్ సహా ఇతర దేశాలు చైనాలో ఉన్న తమ పౌరుల్ని స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చైనాలో 23,000 పైగా భారతీయ విద్యార్థులు ఉండగా అందులో 21,000 మంది వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ముంబయిలో 423 సీట్లతో కూడిన జంబో విమానాన్ని సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే ఈ విమానం చైనా బయలుదేరనుంది. హాంకాంగ్ లో మరో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. బకాంల్లో 7, తైవాన్ లో 8 మందికి ఈ వైరస్ సోకినట్లు చైనా హెల్త్ కమిషన్ తెలిపింది. వైరస్ వ్యాప్తి దృష్ట్యా చైనాలోని పలు నగరాలకు తమ సర్వీసులను నిలిపేయాలని ఎయిరిండియా, ఇండిగో, బ్రిటిష్ ఎయిర్ వేస్, లైన్ ఎయిర్ తదితర విమానయాన సంస్థలు నిర్ణయించాయి. ఇప్పటికే భారత్, అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు చైనా పర్యటనకు వెళ్లొద్దని తమ పౌరులకు సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యుహెచ్వో సూచించింది. అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించి ఆ అంశం పై చర్చించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించనుంది.