English | Telugu

సేల్..సేల్..సేల్.. ప్రభుత్వ భూముల అమ్మకంతో జగన్ ఇచ్చిన హామీల అమలు

ఆర్థిక కష్టాలు ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. పాదయాత్రలో జగన్ హామి ఇచ్చిన అనేక పథకాలకు నిధుల కొరత ఏర్పడింది. గత ఐదు నెలలుగా ఆదాయ వనరులు తగ్గిపోవడంతో కొత్తమార్గాలపై అన్వేషణ ప్రారంభించారు. ప్రభుత్వ భూముల విక్రయానికి మిషన్ బిల్డ్ పై ఒప్పందం కార్యరూపం దాల్చనుంది. ప్రభుత్వ భూములను విక్రయించి నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నవరత్నాలతో పాటు పాఠశాల రూపురేఖలు మార్చే నాడు నేడు సదుపాయాల కల్పనకే ఈ నిధులు కేటాయిస్తామని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఒప్పందం కంటే ముందే భూములపై స్పష్టత రావాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో ఖాళీ భూములు ఎక్కడ ఉన్నాయి.. వాటి విస్తీర్ణం ఎంత.. పట్టణాలు గ్రామాల్లో ఎంత భూమి ఉంది.. వాటి రికార్డులు పరిస్థితి మొదలగు వివరాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ నివేదికను పరిశీలించి సిద్ధంగా ఉన్న భూముల లెక్కలు తీస్తోంది. సీఎం అధ్యక్షుడిగా ఉండే రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీకి నివేదించిన తర్వాత కమిటీ నిర్ణయం ద్వారా విక్రయిస్తారు. ఇక శాఖల వారీగా చూస్తే మిషన్ బిల్డ్ అమ్మకాలు, ఆర్ అండ్ బీ శాఖ నుంచి ప్రారంభం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 1750 ఎకరాల భూములు ఉన్నాయని.. 60కి పైగా అతిథి గృహాలు ఉన్నాయని నిర్థారించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అర్బన్ పరిధిలో ఉన్న భూముల విలువ 6,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. గత ప్రభుత్వం ఈ భూముల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలని భావించింది. అయితే అది పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక కొరత కారణంగా ఈ భూములను విక్రయించాలని నిర్ణయించింది. వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న గెస్ట్ హౌజ్ ల చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలు కూడా అమ్మి ఆదాయం సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లతో పాటు సాధారణ పరిపాలన శాఖ నిర్వహణలో ఉన్న స్టేట్ గెస్ట్ హౌజ్ ల జాబితా కూడా సిద్ధం చేస్తున్నారు.

విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం మూడు ఎకరాల్లో ఉంది. ఇందులో ఎకరంన్నర ఖాళీగా ఉంటే చెట్లు పార్కింగ్ వంటి వాటికి ఈ స్థలాన్ని వినియోగిస్తారు. ఇక రాష్ర్టానికి వచ్చే వీఐపీలు ఇక్కడే బస ఏర్పాటు చేస్తారు. మంత్రులూ అతిథులు కూడా ఈ గెస్ట్ హౌస్ లోని సేదతీరుతుంటారు. అన్ని విధాలా అనుకూలంగా ఉన్న ఈ స్థలం అమ్మకానికి పెడుతున్నారు. ఇదే జరిగితే భవిష్యత్ లో చాలా ఇబ్బందులు వస్తాయని అధికారులంటున్నారు. వీవీఐపీలకు ఆతిథ్యమిచ్చే గెస్ట్ హౌస్ చుట్టూ ప్రైవేట్ కట్టడాలు వస్తే భద్రత కూడా కష్టసాధ్యంగా మారుతుందంటున్నారు. వీవీఐపీలు ముఖ్య అతిధులను విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు తీసుకువస్తుంటారు. ఇది అమ్మితే స్టార్ హోటల్స్ లో వారికి బస ఏర్పాటు చేయటం ద్వారా ప్రభుత్వానికి భారం పడే అవకాశం ఉంది. ఇటువంటి కారణాల నేపథ్యంలో ఈ ఆలోచన సరికాదని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. అధికారులు అన్ని శాఖల నిర్వహణపై సమాచారం సేకరిస్తున్నారు. శాఖల వారీగా భూముల లెక్కలు తీసి సర్కారుకు అందిస్తారు. త్వరలో దీనిపై కేబినెట్ సమావేశమై అధికారిక ఆస్తులు అమ్మే అంశానికి సంబంధించిన జాబితాను ప్రకటించే అవకాశముంది.