తమిళనాడు సీఎం పళనిస్వామి నివాసం, సచివాలయంపై బాంబులతో దాడి చేస్తామంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ఈ బెదిరింపు కాల్ తో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్, డాగ్ స్క్వాడ్ టీములను వెంటనే రంగంలోకి దించారు. సీఎం పళనిస్వామి నివాసం, సచివాలయం సమీపంలో తనిఖీలు చేపట్టారు. సచివాలయంలోని అన్ని మార్గాల్ని తమ ఆదీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. సీఎం ఇంటి పరిసరాల్లోనూ భద్రతను పెంచారు. ప్రవేశ మార్గంలో మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. మరోవైపు, బెదిరింపు కాల్ చేసి పోలీసులను పరుగులు పెట్టించిన వ్యక్తి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు వెతుకుతున్నారు.
కాగా, ఇటీవల పళనిస్వామి నివాసం, సచివాలయంకి ఇలాంటి బెదిరింపులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా.. చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులో ఉన్న పళనిస్వామి నివాసం, మెరీనా తీరంలోని కామరాజర్ సాలైలో ఉన్న సచివాలయం వద్ద భద్రతను పెంచారు.