English | Telugu
చార్మినార్ దగ్గర సంజయ్ హల్చల్! కేసీఆర్ పారిపోయారని ఫైర్
Updated : Nov 20, 2020
భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ టీఆర్ఎస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ మతం పేరుతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారని, ఓ మతం ఓట్లతోనే గ్రేటర్‌లో గెలవాలనుకోవడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. కేంద్రంలో పేదల ప్రభుత్వం ఉందని, నిధులు తీసుకొస్తామని బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి రాకపోయినా పరవాలేదని, ఫోన్‌లో అయినా తన సవాల్‌పై స్పందిస్తే చాలని వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పని అయిపోయిందని కేసీఆర్‌కు అర్థమైందన్నారు బండి సంజయ్.
హైదరాబాద్ లో వరద సాయం కింద పంపిణి చేసిన 550 కోట్ల రూపాయల్లో సగం డబ్బులు టీఆర్‌ఎస్ నేతలే మింగేశారని సంజయ్ ఆరోపించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే నేరుగా బాధితుల అకౌంట్లలోనే నగదు వేయాలన్నారు. అబద్ధాలతో కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. గ్రేటర్‌లో బీజేపీని గెలిపిస్తే వరద సాయం కింద ఒక్కో కుటుంబానికి 25 వేల రూపాయల సాయం చేస్తామని బండి సంజయ్ మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ విశ్వనగరం అని చెప్పి విషాద నగరంగా మారుస్తున్నారని విమర్శించారు. రిజిస్ట్రేషన్లు ఆపి పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. డబుల్ బెడ్‌రూమ్‌లు, ఎల్‌ఆర్‌ఎస్‌పై కేసీఆర్ ఎందుకు మాట్లాడటంలేదని బండి నిలదీశారు.