English | Telugu
హర్యానాలో బీజేపీలో లెక్కలు తప్పాయి.. అసలు కారణమిదే!!
Updated : Oct 26, 2019
హర్యానాలో సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన బీజేపీ... జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అయితే, గత పాలకులతో పోల్చితే అద్భుత పాలన అందించామని, ఈసారి 70 ప్లస్ సీట్లు రావడం ఖాయమని కమలదళం వేసుకున్న లెక్కలు అంచనాలు తారుమారు కావడంపై బీజేపీ పోస్టుమార్టం మొదలుపెట్టింది. సీట్లు తగ్గడానికి అసలెక్కడ తప్పు జరిగిందంటూ అంతర్మథనం మొదలైంది. నాలుగు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ క్వీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని పదికి పది స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. అంతేకాదు లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 58శాతం ఓట్లను బీజేపీ సాధించింది. అయితే, 150 రోజుల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఊహించనివిధంగా షాకిచ్చారు. లోక్ సభ రిజల్ట్స్ ను చూసి, ఈసారి 70 ప్లస్ సీట్లతో బీజేపీ ఘనవిజయం ఖాయమని అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి. మరి అందుకు భిన్నంగా ఫలితాలు ఎలా వచ్చాయంటూ బీజేపీ అగ్రనాయకత్వం పోస్టుమార్టం మొదలుపెట్టింది.
హర్యానా ఫలితాలను గమనిస్తే, ఖట్టర్ పరిపాలనపై ప్రజలు అంత సంతృప్తికరంగా లేరనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగం, మహిళలపై దాడులు, పెరుగుతున్న ధరలు బీజేపీపై ప్రతికూల ప్రభావం కనబర్చాయని అంటున్నారు. ఇక, హర్యానాలో జాట్ లదే ఆధిపత్యం. కానీ బీజేపీ... నాన్ జాట్ అయిన ఖట్టర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అసలు జాట్ల ఆధిపత్యానికి గండికొట్టాలన్నదే బీజేపీ వ్యూహం. కానీ అదే బీజేపీకి వ్యతిరేకంగా జాట్లంతా సంఘటితం కావడానికి దారితీసింది. చివరికి, జాట్ల కారణంగానే బీజేపీ అనుకున్న సీట్లు సాధించలేకపోయిందని అంచనాకి వస్తున్నారు. అయితే, మళ్లీ ఖట్టర్ నే ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ అధిష్టానం కూర్చోబెడుతోంది. మరి ఈసారి ఏమాత్రం తేడా కొట్టినా, ముందుముందు అది ఢిల్లీ పీఠానికే ముప్పు తెచ్చిపెట్టడం ఖాయం.