English | Telugu

తెలంగాణలో‌ కమలం వికసిస్తోందా??

తెలంగాణలో పాత జిల్లాల ప్రకారం చూసుకుంటే మూడు నాలుగు జిల్లాల్లో మాత్రమే బిజెపికి అంతో ఇంతో పట్టుంది. హైదరాబాదులో నేతలున్నారు, నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లో అప్పుడప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే మొన్నటి ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచారు. వాటిలో ఉత్తర తెలంగాణలోనే మూడు స్థానాల్లో విజయం సాధించారు. హైదరాబాద్ తరవాత ఇప్పుడు బీజేపీ ఫోకస్ ఉత్తర తెలంగాణ పై పడినట్టు సమాచారం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలపై ఆ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఏంపీగా ఇక్కడ అరవింద్ గెలిచారు, కానీ జిల్లాలో మాత్రం ఇంకా కమలంకు పట్టు దొరకలేదు. నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజక వర్గాల్లో ఇప్పటి వరకూ బలమైన నేతలు లేరు. దీంతో నేతల ఆకర్షణకు బీజేపీ నేతలు ప్లాన్ వేశారని తెలుస్తోంది.

ఇటీవల బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఎంపీ అరవింద్ ఇంటికి వెళ్లి చర్చలు జరపడం చర్చ నీయాంశంగా మారింది. అయితే ఆ తర్వాత పార్టీ మారే ఉద్దేశం లేదని షకీల్ చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో కూడా బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లారని దీనిని బట్టి తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఏలేటి అన్నపూర్ణ ఆమె కుమారుడు మల్లిఖార్జునరెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందని సమాచారం. త్వరలో అన్నపూర్ణ తన కుమారుడితో కలిసి పార్టీలో చేరే అవకాశముందని ప్రచారముంది. డి శ్రీనివాస్ సైతం బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. ఆయన అనుచరులు అరవింద్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో ఆయన కూడా కమలం కండువా కప్పుకుంటారనే టాక్ నడుస్తోంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, ఎల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్ లాంటి బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే కాంగ్రెస్ లో బలమైన నేతలుగా ఉన్న మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వీరితో పాటు ఒకరిద్దరు కూడా ఎన్నికల సమయం నాటికి బీజేపీ కండువా కప్పుకొంటారనేది నేతల అంచనా. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కమలం పార్టీకి అగ్నిపరీక్షలా మారాయి. ఈలోపే బలమైన నేతలను చేర్చుకొని అధికార పార్టీకి సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్న గులాబీపార్టీ ఎత్తులకు బిజెపి నేతలు పైఎత్తులు ఎలా వేస్తారో వేచిచూడాలి. ఆపరేషన్ ఆకర్ష్ ను వికర్ష చేసేందుకు టీఆర్ఎస్ నేతలు సైతం పావులు కదుపుతుండడంతో ఇందూరు రాజకీయం రంజుగా మారింది.