English | Telugu

అజారుద్దీన్ కు మంత్రి పదవి.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా జూబ్లీ బైపోల్ లో ప్రయోజనం పొందుదామని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు సొంత పార్టీ నుంచే కాకుండా, బీజేపీ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముందుగా కాంగ్రెస్ విషయానికి వస్తే.. గత కొంత కాలంగా తనకు కేబినెట్ బెర్త్ ఇవ్వాలంటూ ఊరూవాడా ఏకం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అజారుద్దీన్ కు మంత్రి పదవి వార్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తాను పార్టీ వీడడానికి కూడా వెనుకాడబోనని సన్నిహితుల వద్ద చెబుతున్నారు. సరే కాంగ్రెస్ లో ఇలాంటి అలకలు, ఆగ్రహాలు, అసంతృప్తులూ సహజమేనని లైట్ తీసుకున్నా.. బీజేపీ ఏకంగా అజారుద్దీన్ కు మంత్రిపదవిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

వాస్తవానికి అజారుద్దీన్ కు రేవంత్ రెడ్డి కేబినెట్ లోకి తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతన్న మాట వాస్తవమే అయినా, ఇందుకు శుక్రవారం (అక్టోబర్ 31) ముహూర్తం అని గట్టిగా వినిపిస్తున్నా... ఇందుకు సంబంధించిన అదికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే బీజేపీ ఆజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకునే కార్యక్రమం వాయిదా పడేలా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకులు పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డి గురువారం (అక్టోబర్ 30) ఉదయం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జూబ్లీ ఉప ఎన్నికకు ముందు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడమంటే.. ఈ ఎన్నికలో ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని బీజేపీ అంటోంది. చూడాలి మరి ఈ ఫిర్యాదుపై ఈసీ ఎలా స్పందిస్తుందో?