English | Telugu

మంత్రి వ‌ర్గంలోకి అజారుద్దీన్.. అల‌క‌లో రాజ‌గోపాల్ !?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల వేళ‌.. అజ‌హరుద్దీన్ కి మంత్రి వ‌ర్గంలోకి చోటు క‌ల్పించి ఇటు ఎంఐఎం ద్వారా ముస్లిం ఓటు బ్యాంకు క‌వ‌ర్ చేస్తూనే.. అటు గ‌తంలో ఇక్క‌డి నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజహరుద్దీని కి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా.. వారిని మ‌రింత ఆక‌ట్టుకునే య‌త్నంలో కాంగ్రెస్ ఉంది. అయితే.. అజ‌హరుద్దీన్ కి మంత్రి ప‌ద‌వి ఇవ్వాలన్న నిర్ణయం ఈ నాటిది కాదు... ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తార‌న్న‌ప్ప‌టి రేవంత్ కేబినెట్ లో ఆయనకు స్థానం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. దానికి తోడు ఇప్ప‌టి వ‌ర‌కూ కేబినెట్ లో మైనారిటీకి చోటు లేకపోవడంతో అజార్ కు కేబినెట్ బెర్త్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే స‌మ‌యంలో హోం మంత్రిత్వశాఖఎలాగూ రేవంత్ ద‌గ్గ‌రే ఉంది. ఈ రెండింటినీ బేరీజు వేసుకోవ‌డంతో పాటు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స‌మ‌యంలో అజహారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా స్వామికార్యం- అంటే న‌వీన్ కార్యం కూడా పూర్తి చేయాల‌న్న‌ది రేవంత్ స్కెచ్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

గ‌తంలో ఆరు మంత్రి ప‌ద‌వులు ఖాళీగా ఉండ‌గా.. వాటిలో మూడింటిని మాత్ర‌మే ఇచ్చి మిగిలిన మూడింటినీ అట్టేపెట్టి ఉంచారు. ఇదంతా ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ ఆలోచ‌న‌. ఇప్పుడు అవ‌స‌రానికి ఇందులో ఒక మంత్రి ప‌ద‌వి బ‌య‌ట‌కు తీశారు. మిగిలిన రెండింటి ప‌రిస్థితి ఏంట‌ని చూస్తే.. ఇప్ప‌ట్లో వీటిని భర్తీ చేసే అవకాశాలు కనిపించడం లేదంటున్నారు.

దీంతో గ‌త కొన్నాళ్లుగా మంత్రి ప‌ద‌వి కోసం ఎదురు చూస్తున్న రాజ‌గోపాల్ రెడ్డి తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డంతో పాటు.. అస‌లీ పార్టీలోనే ఉండ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చార‌న్న వ‌దంతి ఒక‌టి గుప్పు మంటోంది. ఇటు అజ‌హరుద్దీన్ కి మంత్రి ప‌ద‌వి ఇస్తారో లేదో కానీ అటు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపార్టీ వీడేలా క‌నిపిస్తోంది. రాజ‌గోపాల్ రెడ్డి గ‌తంలో కూడా ఇలాగే పార్టీ వీడి త‌ర్వాత తిరిగి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కూ ఆయ‌న‌కున్న భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు కాంగ్రెస్ లో త‌ప్ప మ‌రెక్కడా వీలు కాదు. కాబ‌ట్టి.. ఆయ‌న వెళ్తే వెళ్లాడు-మ‌ళ్లీ వ‌చ్చేస్తాడులెమ్మ‌న్నభావనలో అధిష్టానం ఉన్న‌ట్టుగా స‌మాచారం. మ‌రి చూడాలి ఈ ప‌రిణామ క్ర‌మాలు ఏ రీతిన మారుతాయో తేలాల్సి ఉంది.