English | Telugu

రాబోయే కాలంలో..కాబోయే మంత్రులెవరు?

శాసన మండలి రద్దు నిర్ణయం, రాజ్యసభ ఎన్నికలు..ఈ రెండు సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో రెండు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణ ఇద్దరు కూడా ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులయ్యారు. వారిద్దరూ ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్నారు. ఈ రెండు మంత్రి పదవులను ఇప్పుడు భర్తీ చేయాల్సి ఉంది. ఒక రకంగా చూస్తే ముఖ్యమంత్రి జగన్ కు ఇది ఒకింత ఇబ్బందికర పరిణామమే. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఈ ఇబ్బంది తలెత్తుతోంది. ప్రస్తుతం జగన్ కు ఎదురు తిరిగే పరిస్థితి లేనప్పటికి అసంతృప్తి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. రాజ్యసభ సీట్ల వ్యవాహరంలో కూడా ఇబ్బందులు వస్తాయి అనుకున్నా తన మాటే శాసనం అన్నట్టు జగన్ చేసుకోగలిగారు.

జగన్ కు ఎదురు తిరగడం మాట అటుంచి అసలు ఆ ఆలోచన కూడా మనసులోకి వచ్చే అవకాశం లేదు. అయితే మనసులో ఆశలను మాత్రం అణచుకోలేక, నేరుగా అడగలేక, అలగలేక వైసీపీ ఎమ్మెల్యేలు తమలో తామే కుమ్ములో పెట్టిన వంకాయల్లాగా మగ్గిపోతున్నారు. ఈ రెండు పోస్టుల కోసం ఆశలు పెట్టుకున్న అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే లాబీయింగ్ చేసుకుంటున్నారని సమాచారం. ఈ రెండు పదవులు ఎవరిని వరించబోతున్నాయి? జగన్ చల్లని చూపులు ఎవరి వైపు ఉన్నాయి? అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తరువాత మంత్రి వర్గంలో స్థానం లభిస్తుంది అని మొదటిగా వినిపించిన పేరు రోజా. రోజాకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకో ఆమెకు పదవి దక్కలేదు. అలిగిన రోజాను బుజ్జగించి ఆమెకు ఏపీఐఐసి చైర్మన్ పదవిని ఇచ్చారు. ఆ సమయంలోనే ఈ సారి మంత్రి వర్గంలో మార్పులు జరిగితే మంత్రి పదవి ఇస్తాను అని జగన్ ఆమెకు హామీ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.

ఒక సారి మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి అనిపించుకోవాలనుకుంటున్న జగన్ ఈ సారి రోజాకు మంత్రి పదవి ఇస్తారో లేదో చూడాలి. ఎన్నికల సమయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవిపై బహిరంగంగా హామీ ఇచ్చినందున ఈ సారి అయినా తనను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని అయన కోరుకుంటున్నారు. ఎలాగూ ఖాళీ అవుతున్న స్థానం కూడా గుంటూరు జిల్లా నుంచే కావడంతో ఈ సారి పదవిపై ఆళ్ల ఆశలు పెట్టుకున్నారు. వీరితో పాటుగా పార్ధసారధి, కోటంరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు తదితరులు కూడా మంత్రి పదవులను ఆశిస్తున్నారు.

మరి వీరిలో ఎవరికీ మంత్రి పదవులు దక్కుతాయో చూడాలి. మరోవైపు స్పీకర్ గా ఉన్న తమ్మినేనికి స్పీకర్ పదవి నుంచి తప్పించి మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.