English | Telugu
ఏపీకి కరోనా రాదు.. ఎందుకో తెలుసా...
Updated : Mar 14, 2020
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రంతో పాటు చాలా రాష్ర్టాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాళ్, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాలు విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అసెంబ్లీ వేదికగా కరోనాను రాష్ట్ర విపత్తుగా ప్రకటించారు. విద్యాసంస్థలతో పాటు స్విమ్మింగ్ పూళ్లు, జిమ్‌లు కూడా మూసివేయాలని ఆదేశించారు. మార్చి 31వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఢిల్లీ సర్కార్ ఇప్పటికే విద్యాసంస్థలు, సినిమాహాళ్లను మూసివేయగా.. తాజాగా ఐపీఎల్ మ్యాచులపై నిషేదం విధించింది. ఇక యూపీ సర్కార్ మార్చి 21వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో కేరళ అసెంబ్లీ నిరవదిక వాయిదా పడింది.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు అసెంబ్లీలో కరోనా వ్యాప్తి గురించి మాట్లాడారు. విదేశాల నుంచి వస్తున్నా వారి వల్లే కరోనా రాష్ట్రానికి వస్తోందని చెప్పారు. సాయంత్రం మంత్రిమండలి సమావేశం నిర్వహించి ఇతర రాష్ట్రాలలో వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించి ఇక్కడ కూడా సరైన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
ఇప్పటికే కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా వైరస్ నియంత్రణకు వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలపై ఢిల్లీ నుండి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కూడా. వైరస్ వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాలను సన్నద్ధం చేసి వారి సేవలను పూర్తిగా వినియోగించు కోవాలని తెలిపారు. కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయాలన్నారు. వీలైనంత వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకచోటకు చేసే సభలు, సమావేశాలు వంటి కార్యక్రమాలను కొంత కాలం పాటు వాయిదా వేసుకునేలా ఆయా నిర్వాహకులను కోరాలని సూచించారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలు, అంగన్ వాడీ వర్క్‌లు, ఆశా వర్కర్లు సేవలను వినియోగించుకుని ప్రజల్లో అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా అన్నిపాఠశాలల్లో విద్యార్థులకు దీనిపై అవగాహన కల్పించి వ్యక్తి గత పరిశుభ్రతపై చైతన్యం కల్పించాలని తెలిపారు. తగిన సంఖ్యలో ఎన్-95 మాస్క్‌లను సిద్ధం చేసి అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కరోనా వైరస్ బయటపడినప్పటి నుంచి విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ స్రీనింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కానీ క్షేత్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి కేంద్రానికి నివేదించినట్టు కానీ, కేంద్రం సూచించిన విధంగా కానీ ఎలాంటి చర్యలు తీసుకున్నట్టు కనిపించడంలేదని ప్రజలు అంటున్నారు.
ఇంతవరకూ అంతా బాగానే ఉంది..ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంతుబట్టని విషయం ఏంటంటే దేశ ప్రధాని సహా రాష్ట్రాల ఇన్ని ముఖ్యమంత్రులు కరోనాపై స్పందించినా మన ముఖ్యమంత్రి మాత్రం ఎందుకు స్పందించడంలేదు? ఎందుకు సంబందిత అధికారులతో ఒక సమీక్ష చెయ్యరు, సూచనలివ్వరు అన్నది. అసలు సిఎం జగన్ ఏమనుకుంటున్నారు? అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీసాక కూడా మన రాష్ట్రానికి ఇతర దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి ఎవరొస్తారు? అందరు ముఖ్యమంత్రులు ఇప్పుడు కరోనా రాకుండా చర్యలు తీసుకుంటున్నారు..కెసిఆర్ కూడా చెప్పారు కదా విదేశాలనుంచి వస్తున్న వారే కరోనా తెస్తున్నారని..ఆ విషయం నాకు ముందే తెలుసు. అందుకే నేను అధికారంలోకి రాగానే కరోనా రాకుండా చర్యలు మొదలు పెట్టాను అని జగన్ అనుకుంటున్నారేమో అని కొందరు వెటకారం చేస్తున్నారు. ప్రజల మీద జగన్ కు ఎంత కక్ష ఉందో తెలుస్తోందని మరికొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరో వైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాత్రం ఒక మున్సిపల్ కార్పోరేషన్ కు 5గురు డిప్యుటీ మేయర్ అభ్యర్దులను నియమించామని ఇది దేశంలోనే ప్రధమం అని చెప్తున్నారు కానీ కరోనా బారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారో చెప్పడంలేదని ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. మరో వైపు రాష్ట్ర బీజేపీ మాత్రం సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కరోనా గురించి ఎంత హడావుడి చేసేవారో అని కామెడీ మెసేజులు పెడుతూ రాక్షసానందం పొందుతోందని ప్రజలు అంటున్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి స్పందించి కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకునేలా చూడాలని ప్రజల ఆకాంక్ష.