English | Telugu

అరుంధతీ కనపడదు...అధ్వాన్నమూ కనపడదు.. అరవై వరహాల అప్పు మాత్రం రెడీ!

అరుంధతీ కనబడదు, అధ్వాన్నం కనబడదు, అరవై వరహాల అప్పుమాత్రం కనపడుతోంది అన్నట్టుంది సెక్రెటేరియట్ ఉద్యోగుల పరిస్థితి. విశాఖకు ఎప్పుడు షిఫ్ట్ అవుతామో అనే దాని మీద వస్తున్న క్లారిటీ, ప్రభుత్వం తమ విషయం లో ఎంత ఉదారంగా ఉండదలచిందో అనే అంశం లో మాత్రం రాకపోవటం వారికి ఇబ్బందిగా పరిణమించింది. మేలో ప్రారంభించి జూన్ చివరి నాటికి సచివాలయంతో పాటు ఇతర శాఖాధిపతుల కార్యాలయాలను విశాఖకు తరలించాలని పట్టుదలగా ఉన్న ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలనే ఆలోచనలో ఉంది. దీంతో సచివాలయ ఉద్యోగులు తమ ముందు పెట్టిన డిమాండ్లలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా అధికారులను కోరింది. దీంతో వారు ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. త్వరలో వారు ఉద్యోగులకు క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే, ఈ క్లారిటీ లో భాగం గా వారికేమైనా ఆర్ధిక పరమైన సహాయం, షిఫ్టింగ్ నిమిత్తం వస్తుందా , లేదా అనేదే వచ్చే బుధవారం నాటికి క్కూడా తేలుతుందో, లేదో వారికీ తెలీటం లేదు.

విశాఖ వెళ్లేందుకు ప్రభుత్వం ముందు తాము ఉంచిన డిమాండ్లపై అధికారుల నుంచి సానుకూల వస్తున్న తరుణంలో తమ నిర్ణయాన్ని ప్రకటించే ముందు చివరి సారిగా వచ్చే బుధవారం భేటీ కావాలని సచివాలయ ఉద్యోగులు నిర్ణయించారు. దీంతో ఈ భేటీలో ఏం తేల్చబోతున్నారనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం ముందు తాము పెట్టిన ప్రతిపాదనల్లో భాగంగా కీలకమైన విశాఖలో ఫ్లాట్ల వ్యవహారంపై వచ్చే స్పందన ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే సచివాలయ ఉద్యోగుల్లో దాదాపు 600 మందికి పైగా అమరావతిలో ఇళ్లు కట్టుకోవడం లేదా కొనుక్కోవడం చేశారు. ఇప్పుడు వీరికి విశాఖలో ప్రభుత్వం ఏం ప్రత్యామ్నాయం చూపిస్తుందో చూడాల్సి ఉంది.ఏ పీలో మూడు రాజధానుల ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో మే నెల తర్వాత విశాఖ నుంచే అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో మే నెలలో అమరావతిని వీడి విశాఖకు వెళ్లే విషయంలో ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచిన సచివాలయ ఉద్యోగులు వాటి విషయంలో ప్రభుత్వం నుంచి హామీల మేరకు తుది నిర్ణయం తీసుకునేందుకు వచ్చే బుధవారం సమావేశం కానున్నారు. ఇందులో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశముంది.

మే నెల తర్వాత విశాఖ వేదికగా పాలన ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో ఆ లోపే ఉద్యోగులను అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు ఏపీ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సచివాలయ ఉద్యోగ సంఘాలతో సీఎస్ నీలం సాహ్ని పలుమార్లు భేటీ అయ్యారు. ఇందులో ఉద్యోగులు విశాఖ వెళ్లేందుకు తమ ముందు ఉంచిన ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. వీటిని ప్రభుత్వం ముందు ఉంచారు. ప్రస్తుతం ఏపీ రాజధానిగా ఉన్న అమరావతి నుంచి విశాఖ వెళ్లేందుకు సచివాలయ ఉద్యోగులు పలు డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిలో ప్రధానంగా విశాఖకు మే నెలలో వెళ్లగానే అక్కడ తాత్కాలికంగా అయినా సరే ప్రభుత్వం వసతి సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. అలాగే విశాఖకు వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇతర ఛార్జీలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అలాగే తమ పిల్లలకు విశాఖలో స్కూల్ అడ్మిషన్లు దొరికేలా ప్రభుత్వం సాయం చేయాలని కూడా ఉద్యోగులు అడుగుతున్నారు. వీటితో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానంగా వీటిపైనే ఉద్యోగులు పట్టుదలగా ఉన్నారు.