English | Telugu

నెల రోజుల వ్యవధిలో రెండోసారి కరోనా బారిన పడిన మహిళ

కరోనా నుంచి కోలుకున్నాం, ఇక మాకు తిరుగులేదు అనుకుంటే పొరపాటే. అనేకమంది రెండోసారి కూడా కరోనా బారినపడుతున్నారు. ఇటీవల మనదేశంలో కూడా రెండోసారి కరోనా బారిన పడుతున్న ఘటనలు బాగానే వెలుగు చూస్తున్నాయి. ఏపీలో టీటీడీ ఉద్యోగి రెండోసారి కరోనా బారిన పడిన ఘటన మరువకముందే.. బెంగళూరులో ఓ మహిళ నెల రోజుల వ్యవధిలో రెండోసారి కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. 27 ఏళ్ల మహిళ కరోనా సోకడంతో జులై మొదటి వారంలో ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం నెగటివ్ రావడంతో అదే నెల 24న ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే, నెల రోజుల తర్వాత కరోనా లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరింది. దీంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. బెంగళూరులో రెండోసారి కరోనా సోకిన తొలి వ్యక్తి ఆమే కావడం గమనార్హం.

కాగా, ముంబై లోనూ ఇటీవల నలుగురు వైద్యులు రెండోసారి కరోనా బారినపడ్డారు. నెదర్లాండ్స్, బెల్జియం వంటి దేశాలలోనూ రెండోసారి కరోనా బారినపడిన కేసులు వెలుగుచూస్తున్నాయి. రెండోసారి కరోనా సోకడంపై ఇప్పటికే పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కోలుకున్న తర్వాత వారి శరీరంలో మిగిలి ఉన్న వైరస్ అవశేషాలతో తిరగబెట్టిందా? లేక అది కొత్తగా సోకిందా? అన్న విషయంలో ఇప్పటి వరకు శాస్త్రవేత్తల్లో స్పష్టత లేదు.