English | Telugu

మంచైతే మనదే.. టీడీపీ, వైసీపీ డబుల్ గేమ్.. ఏపీలో రచ్చ

మంచి జరిగితే తమ ఖాతాలో వేసుకోవడం, చెడుదయితే ఇతరులకు అంటగట్టడం. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు ఇదే పంథా అనుసరిస్తున్నాయి. తమ డబుల్ స్టాండర్ట్ విధానాలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు హిట్ అయితే తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫెయిల్ అయితే మాత్రం.. విపక్షాలకు అంటగడుతుంటారు. తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్, రైతు ఆత్మహత్యలపై వచ్చిన ర్యాంకులు, నివేదికలు వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్దానికి దారి తీశాయి.

కేంద్ర సర్కార్ నిర్వహించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ ర్యాకింగ్స్ లో దేశంలోనే ఏపీకి తొలిర్యాంకు ద‌క్కింది. ర్యాంకులు విడుదలైన వెంటనే చంద్రబాబు, టీడీపీ టీమ్.. ఈ ఘనతను ఫుల్‌గా త‌న ఖాతాలోనే వేసుకునే ప్రయత్నాలు చేసింది. గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే.. EODBలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేషన్ ట్వీట్ చేశారు. 2018- 2019‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి ర్యాంకు రావటం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కృషికి నిదర్శనం అని ట్వీట్ లో పేర్కొన్నారు. వైసీపీ నేతలు కూడా తాము ప్రారంభించిన కొత్త పారిశ్రామిక విధానాల వల్లే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని గొప్పలు చెప్పుకున్నారు.

దేశంలో రైతు ఆత్మహత్యలపై ఇటీవలే ఓ సంస్థ నివేదిక ఇచ్చింది. 2019లో రైతు ఆత్మహత్యలు గతంలో కంటే భారీగా పెరిగాయి. దీంతో టీడీపీ నేతలు జగన్ సర్కార్ టార్గెట్ గా ఆరోపణలు చేశారు. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారని నారా లోకేష్ ట్వీట్ చేశారు. విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అసమర్థ వైకాపా ప్రభుత్వం. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది.ఇకనైనా పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడండని లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు. వైసీపీ నేతలు కూడా ఘాటుగాగే స్పందించారు. చంద్రబాబు ఐదేండ్ల పాలనలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురైందని, అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

2019 మే వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జూన్ నుంచి జగన్ పాలన మొదలైంది. ఈ లెక్కన 2019లో ఏం జరిగినా రెండు ప్రభుత్వాలకు లింక్ ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ స‌ర్వే 2019 ఆగ‌స్టు వ‌ర‌కు జ‌రిగిందని కేంద్ర‌మే ప్ర‌క‌టించింది. దీనిని బ‌ట్టి మేలోనే పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన జ‌గ‌న్‌కు కూడా దీనిలో భాగం ఉంద‌నే చెప్పాలి. ఇక‌ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన‌.. ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు పాలించారు కాబ‌ట్టి చంద్ర‌బాబు కూడా ఫిఫ్టీ ప‌ర్సెంట్ ద‌క్కుతుంది. కాని ఎవరికి వారు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. రైతు ఆత్మహత్యలకు రెండు ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. కాని ఎవరూ ఆ పని చేయడం లేదు.

ఇక‌ జ‌గ‌న్ సర్కార్ విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అంటూ రైతులు వినియోగించే విద్యుత్ కు మీట‌ర్లు పెడ‌తామ‌ని చెబుతున్నారు. మంత్రి పేర్ని నాని.. కేబినెట్‌లో తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించిన వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు.. ఇది నా ఆలోచ‌నే! అంటూ ప్ర‌చారానికి దిగారు. సంస్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడు తానేన‌ని ప్ర‌క‌టించుకున్నారు. ఓ రెండు గంట‌లు గ‌డిచిన త‌ర్వాత ఇది అక్ర‌మం, అన్యాయం అంటూ.. గొంతు స‌వ‌రించుకున్నారు చంద్రబాబు. రైతుల‌కు శాప‌మంటూ తిట్ట‌దండ‌కం అందుకున్నారు. ఇలా అన్ని విష‌యాల్లోనూ టీడీపీ, వైసీపీలు.. మంచిని తమ ఖాతాలో వేసుకుంటూ.. చెడును ఇతర పక్షాలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు డబుల్ గేమ్ ఆడుతుండటంపై స‌ర్వ‌త్రా విమర్శలు వస్తున్నాయి.