English | Telugu
కారెక్కనున్న అజారుద్దీన్..! కవితకు లైన్ క్లియర్...! ఒకే దెబ్బకు రెండు పిట్టలు.!
Updated : Sep 28, 2019
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, హెచ్‌సీఏ అధ‌్యక్షుడు అజారుద్దీన్ కారెక్కుతారనే ప్రచారం జరుగుతోంది. హెచ్‌సీఏ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అజారుద్దీన్ అండ్ ప్యానెల్... మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనుంది. అయితే, టీఆర్ఎస్ పరోక్ష సహకారంతోనే హెచ్‌సీఏ ఎన్నికల్లో అజార్ అండ్ ప్యానెల్ విజయం సాధించిందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్ కేటీఆర్... హెచ్‌సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ గెలుపు వెనుక చక్రం తిప్పారని అంటున్నారు. హెచ్‌సీఏ ఎన్నికలకు ముందు కేటీఆర్‌తో పలుమార్లు సమావేశమైన అజారుద్దీన్... తన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టమైన హామీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
2009లో ఉత్తరప్రదేశ్ మురాదాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన అజారుద్దీన్, ఆ తర్వాత ఢిల్లీ రాజకీయాలకు స్వస్తి చెప్పి, హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. కాంగ్రెస్ కూడా అజార్‌ను తెలంగాణ వరకే పరిమితం చేసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో అప్పట్నుంచి పార్టీ మారాలనే ఆలోచన చేసిన అజారుద్దీన్... టీఆర్ఎస్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అలా, టీఆర్ఎస్ అండ్ కేటీఆర్ మద్దతుతోనే హెచ్‌సీఏ ఎన్నికల్లో అజార్ ఘనవిజయం సాధించారని చెబుతున్నారు. దాంతో అజార్, త్వరలోనే గులాబీ కండువా కుప్పుకుంటారని అంటున్నారు.
ఇక, ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా, అటు క్రికెట్ రాజకీయాల్లో... ఇటు మైనారిటీల్లో... పట్టు కోసం టీఆర్‌ఎస్ పావులు కదిపినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో పట్టు కోసం ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం... దాన్ని అజార్ రూపంలో దక్కించుకుందని అంటున్నారు. అజారుద్దీన్ ఎన్నికతో హెచ్ సీఏను టీఆర్ఎస్ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నట్లేనని భావిస్తున్నారు. అయితే, అజార్ కు పరోక్ష మద్దతివ్వడం వెనుకూ మరో లక్ష్యముందనే మాట వినిపిస్తోంది. అజార్‌ను పార్టీలో చేర్చుకుని రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టి, రానున్న రోజుల్లో హెచ్‌సీఏ పగ్గాలు కవిత చేపట్టేలా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.