English | Telugu
రెండ్రూపాయల మందుకు రూ.12 బిల్లు... స్కామ్‌లో 200కోట్లపైనే స్వాహా...
Updated : Sep 30, 2019
ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తవ్వేకొద్దీ డొంక కదులుతోంది. మొత్తం రెండు వందల కోట్లపైనే అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. 2015 నుంచి 2019 వరకు మొత్తం 7వందల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరపగా, అందులో రెండు వందల కోట్లపైనే అవినీతి జరిగినట్లు ఏసీబీ తేల్చింది. కుంభకోణం మొత్తం చర్లపల్లి డిస్పెన్సరీ కేంద్రంగా దేవికారాణి అండ్ బృందం నడిపినట్లు దర్యాప్తులో తేలింది. ఇక, డైరెక్టర్ స్థాయి నుంచి సెక్షన్ ఆఫీసర్ వరకు ఈ స్కామ్ లో ముడుపులు అందినట్లు ఆధారాలతో సహా సేకరించారు. 2015లో దేవికారాణి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ఈ స్కామ్ మొదలైనట్లు గుర్తించారు.
డైరెక్టర్ దేవికారాణిని అడ్డంపెట్టుకుని ఫార్మాసిస్టులు అందినకాడికి దోచుకున్నట్లు రికార్డుల్లో తేలింది. ప్రతీసారి లక్షల్లో మందులు కొనుగోలు చేసి, కోట్లల్లో బిల్లులు చేసుకున్నట్లు గుర్తించారు. 2 రూపాయలు ఖరీదు చేసే మందులను 12 రూపాయలకు కొనుగోలు చేసినట్లు చూపుతూ కోట్ల రూపాయలను స్వాహా చేశారు. ఇక, అవసరం లేని మందులను కూడా కొనుగోలుచేసి అడ్డగోలుగా దోచుకున్నట్లు తేల్చారు. అలాగే, ఈఎస్‌ఐకి మందులు సరఫరా చేసిన ఐదు ఫార్మా కంపెనీలపైనా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. భాస్కర ఏజెన్సీ, క్రిష్టల్ ఎంటర్ ప్రైజెస్, శ్రీసంతోష్, గరుడు, లక్ష్మీ ఫార్మాలపైనా ఎంక్వైరీ చేయనున్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో మొత్తం 12మంది ఫార్మాసిస్టులు, 10 ఫార్మా కంపెనీలపై ఆరోపణలు వస్తున్నాయి.
ఈఎస్‌ఐ స్కామ్‌లో డైరెక్టర్ దేవికారాణి అసలు సూత్రధారి కాగా, పద్మ, వసంత ఆ తర్వాత ప్రధాన నిందితులుగా ఉన్నారు. అయితే, ఈ కుంభకోణంలో ప్రత్యక్షంగా-పరోక్షంగా ఇంకా ఎవరెవరి పాత్ర ఉందో తేల్చేపనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిన ఏసీబీ... ఇంకా మరికొందర్ని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. అలాగే, నిందితులను కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం ప్రకటించనుంది.