English | Telugu

అంతా వైఎస్సే చేశారు... ఆయేషా కేసులో కీలక మలుపు

పన్నెండేళ్ల క్రితం దారుణంగా రేప్ అండ్ మర్డర్ కి గురైన ఆయేషా మీరా ఘటన ఇప్పటికీ తీవ్ర సంచలన సృష్టిస్తోంది. న్యాయం కోసం ఆయేషా తల్లిదండ్రులు కాళ్లరిగెలా తిరుగుతూనే ఉన్నారు. అలుపెరగకుండా పోరాడుతూనే ఉన్నారు. వైఎస్ హయాంలో ఆయేషా మర్డర్ జరగ్గా, ఆ తర్వాత ముగ్గురు ముఖ్యమంత్రులు మారిపోయారు. ప్రస్తుతం వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైఎస్ దగ్గర్నుంచి ఇప్పటివరకు మొత్తం ఐదుగురు ముఖ్యమంత్రులను కలిసినా ఆయేషాకు మాత్రం న్యాయం జరగలేదు. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

వైఎస్ హయాంలో జరిగిన ఆయేషా రేప్ అండ్ మర్డర్ వెనుక రాజకీయ నేతల పిల్లలు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. అందుకే, ఈ కేసు విచారణ ఇప్పటివరకూ తేలలేదని అంటారు. అయితే, ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగం మొదటిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయేషా కేసును మొత్తం మాఫీ చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని ఆరోపించారు. ఆయేషా హంతకులు అప్పటి వైఎస్ ప్రభుత్వంలోని ప్రముఖుల పిల్లలు కావడంతోనే తన కూతురికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కొత్త చట్టం అంటున్నారని... కానీ పోలీసులు, ప్రభుత్వాలు... అసలు హంతకులను పట్టుకోకుండా... తిరిగి బాధితులనే ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయేషా తల్లి మండిపడ్డారు. ఆడపిల్లలను కాపాడలేనప్పుడు ప్రభుత్వాలు ఎందుకని ఆయేషా తల్లి ప్రశ్నించారు. అంతేకాదు, మళ్లీ బ్రిటీష్ వాళ్లు వచ్చి పాలిస్తే గానీ భారత దేశం బాగుపడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇక, ఆయేషా తల్లిదండ్రులను పరామర్శించిన మందకృష్ణ మాదిగ కూడా వైఎస్ పైనే విమర్శలు చేశారు. ఆయేషా హంతకులు సంపన్నులు కాబట్టే కేసును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. కులం, మతం చూడకపోతే ఆయేషా హంతకులు ఎప్పుడో దొరికేవారని, వాళ్లకు ఎప్పుడో శిక్షలు పడేవని అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జోక్యం వల్లే అసలు హంతకులు తప్పించుకున్నారని మందకృష్ణ అన్నారు.