English | Telugu

ఏపీలో ఓవైసీ ప‌ప్పులుడ‌క‌వు! ఆంధ్ర‌లోనూ అదే ఎత్తుగ‌డ‌నా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిజంగానే ముస్లింలు వైసిపికి దూరం అవుతున్నారా? విజ‌య‌వాడ‌, గుంటూరు బ‌హిరంగ‌స‌భ‌ల్లో ఎంపి అస‌దుద్దీన్ ఓవైసీ ప్ర‌సంగాల ఉద్దేశం ఏమిటి? ముస్లిం ఓటు బ్యాంక్ జ‌గ‌న్ నుంచి దూర‌మైతే బిజెపి లాభ‌ప‌డుతుందా? అందుకేనా ఓవైసీ ఏపి ముస్లింల ప‌ట్ల స‌వ‌తిత‌ల్లి ప్రేమ ఒల‌క బోస్తున్నారా? ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌చ్చి ఓవైసీ చేసిన ప్ర‌సంగాల వెనుక బిజెపి వ్యూహం వుందా? లేక స్వంతంగా ఎపిలో ఎద‌గాల‌ని ఎంఐఎం తాప‌త్ర‌య ప‌డుతుందా?

దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అయిన ముస్లింల‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేసిన ఘ‌న‌త ఓవైసీ ఖాతాకే వెళుతుంది. ఎంఐఎం ఎన్నిక‌ల్లో పోటీ చేసిన చోట్ల‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీ బాగా లాభ‌ప‌డిన విష‌యం అయా నియోజ‌క‌వ‌ర్గాల ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే స్ప‌ష్టం గా అర్థం అవుతుంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఓవైసీ బ్రదర్స్ ఎనలేని అభిమానం చూపించేవారు. ముస్లింల కోసం ఆనాడు వైఎస్ తీసుకొచ్చిన 4 శాతం రిజర్వేషన్లో లేక ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలో... లేక మరేదైనా కారణముందో తెలియదు గానీ వైఎస్ అన్నా, ఆయన కుటుంబమన్నా ఓవైసీ బ్రదర్స్ ఎప్పుడూ పాజిటివ్ కామెంట్సే చేసేవారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా వైఎస్ ను ఎన్నోసార్లు పొగిడారు. ముస్లింల కోసం వైఎస్ ఎంతో చేశారంటూ అసెంబ్లీ వేదికగా అక్బరుద్దీన్ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చారు.

ఇక, వైఎస్ రాజకీయ వారసుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డిపైనా ఓవైసీ బ్రదర్స్ ప్రేమానురాగాలు, అభిమానం చూపించేవారు. ఎప్పుడూ కూడా జగన్ కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పైగా గతంలో పొగడ్తల వర్షం కూడా కురిపించారు. అంతేకాదు, మొన్నటి ఎన్నికల్లో వైసీపీ గెలవాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.

కానీ, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరుగుతున్నారు. ఎందుకు?

ప్రధాని మోడీ అంటే, జగన్మోహన్ రెడ్డికి భయమని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. మోడీ అండ్ అమిత్ షా అంటే భయం కనుకే, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. అదే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే, సీఏఏ, ఎన్పీఆర్ వంటి చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించేవారంటూ గుంటూరు సభలో ఓవైసీ వ్యాఖ్యానించారు.

అయితే, ఇటీవ‌ల జ‌రిగిన విజ‌య‌వాడ‌, గుంటూరు సభల వెనుక అసదుద్దీన్ కు రాజకీయ వ్యూహం ఉందంటున్నారు. ఇప్పటివరకు తెలంగాణతోపాటు దేశంలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోటీచేస్తూ ఎంఐఎంను విస్తరిస్తున్న అసదుద్దీన్. ఏపీలో కూడా సత్తా చాటాలని నిర్ణయం తీసుకున్నారట. అందులో భాగంగానే ముస్లింలు అధికంగా ఉండే గుంటూరు, కర్నూలు, కడపపై దృష్టిపెట్టారని చెబుతున్నారు. గుంటూరు, కర్నూలు, కడపలో ఇప్పటికే ఎంఐఎం కార్యాలయాలు ప్రారంభించడంతో, జెండాలు, కార్యకర్తల హడావుడి సైతం కనిపిస్తోంది.

అయితే, ఏపీలో ముస్లింలంతా వైసీపీకి ఓటు బ్యాంకుగా మారారని గుర్తించిన ఓవైసీ, ఆంధ్రప్రదేశ్ లో ఎదగాలంటే, వైసీపీ నుంచి ముస్లింలను వేరు చేయాలనే వ్యూహంతో ముందుకెళ్తున్నారని అంటున్నారు. అందుకే సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీలను ఆయుధంగా ప్రయోగిస్తున్నారని చెబుతున్నారు. అందుకే, జగన్‌ పట్ల ముస్లింలలో వ్యతిరేక ముద్ర వేసి, ఏపీలో ఎంఐఎం బలోపేతానికి బాటలేసుకోవాలన్నది ఓవైసీ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయకపోతే, ముస్లింలంతా జగన్‌కు వ్యతిరేకం కావాలని పిలుపునిచ్చారు అసద్.

స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేస్తే గుంటూరు, కర్నూలు, కడపలో ఫలితాలు తారుమారౌతాయి. ఎంఐఎం గెల‌వ‌క‌పోయినా ప్ర‌త్య‌ర్థి పార్టీల గెలుపుకు అవ‌కాశం వుంటుంది. అయితే టిడిపి లాభ‌ప‌డుతుందా? లేక బిజెపి లాభ‌ప‌డుతుందా అనేది ఓవైసీ కే తెలుసు. రాజ‌కీయాల్లో మిత్రులు, శ‌త్రువులంటూ ఎవ‌రూ ఉండ‌రు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్యం.

సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్సీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముస్లింలు వాటిని వ్యతిరేకించని పార్టీలపై కూడా అంతే ఆగ్రహంతో ఉన్నారు. వాస్త‌వ ప‌రిస్థితుల్ని అర్థం చేసుకున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యంతీసుకున్నారు.

2010లో జనాభా లెక్కల ప్రక్రియలో ఏ ప్రశ్నావళి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రక్రియకే పరిమితమవుతాం. ఎన్‌పీఆర్‌ ప్రశ్నల నమూనాలో కూడా మార్పు చేయాలని మంత్రి మండలి తీర్మానం చేసింది. ఎన్‌పీఆర్‌ ప్రక్రియను కూడా నిలిపివేయాలని తీర్మానం చేసి రాష్ట్ర ముస్లింల మ‌న‌స్సుల్ని గెల్చుకోవ‌డ‌మే కాదు ఓవైసీ వ్యూహాన్నిచెక్‌పెట్ట‌డంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విజ‌యం సాధించారు.