English | Telugu

కేసీఆర్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసిన 'బిగ్ బాస్ 3' విజేత?

'బిగ్ బాస్ 3' విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. బుధవారం రాత్రి గచ్చిబౌలిలోని ఓ పబ్ లో జరిగిన గొడవపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. పబ్ మూసివేసే సమయంలో వాష్ రూమ్ నుండి బయటకు వస్తుండగా... తనకు డాష్ ఇచ్చారని, తనతో ఉన్న స్నేహితురాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారని, ఇదేమిటని ప్రశ్నించగా పదిమంది కలిసి బీరు బాటిల్ తో తనపై దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీడియాతో రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. ఈ వివాదంలో అత్యంత చాకచక్యంగా ‌ కెసిఆర్ ప్రభుత్వాన్ని అతడు కార్నర్ చేసినట్టే కనబడుతోంది.

రాహుల్ సిప్లిగంజ్ మీద దాడి చేసిన రితేష్ రెడ్డి సోదరుడు ప్రస్తుతం ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. రాజకీయ పొగరుతోనే తనపై దాడి చేశారని రాహుల్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు... దర్యాప్తును పక్కదోవ పట్టించడానికి రాజకీయపరమైన ఒత్తిళ్ళు రావచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. న్యాయం జరుగుతుందో? లేదో? చూస్తానని రాహుల్ సిప్లిగంజ్ అన్నారు. 'కేసులో పొలిటికల్ ఇన్ఫ్లూయెన్స్ ఉంటుందని మీరు భావిస్తున్నారా?' అని రాహుల్ సిప్లిగంజ్ ను ప్రశ్నించగా... 'ఉండదని అనుమానమా?' అని అన్నారు. కేసు ఉన్నత స్థాయి వరకు వెళ్లిందనీ, ఎవరు ఎవరి మీద దాడి చేస్తారో వీడియోలో అందరూ చూశారనీ, న్యాయం జరగాలని మాత్రమే తాను కోరుకుంటున్నానని రాహుల్ సిప్లిగంజ్ మాటల్లో వినపడింది. ఈ వివాదంపై న్యాయం జరిగేలా చూడాలని రాహుల్ అభిమానులు ట్విట్టర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి సొంత పార్టీ మనుషులను బయటపడేస్తారా? లేదా నిష్పక్షపాతంగా విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా చేస్తారో? చూడాలి.

మీడియా ముందు రాహుల్ సిప్లిగంజ్ మాటలతో ఒకటి మాత్రం స్పష్టమైంది. అతడి మాటల్లోనూ దురుసుతనం బయటపడింది. 'హౌలా గాడు' అనే మాటను రాహుల్ సిప్లిగంజ్ ఎక్కువగా వాడాడు. అతడి భాషపై మీడియా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేయగా... ఇప్పటికీ వాళ్లకు గౌరవం ఇస్తే నన్ను హౌలా గాడు అని ప్రేక్షకులు అనుకుంటారని వ్యాఖ్యానించడం కొసమెరుపు.