English | Telugu
ఆ కొండపైనే ఏపీ సచివాలయం!
Updated : Mar 6, 2020
రాజధాని తరలింపు ప్రక్రియను స్పీడప్ చేసే విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా అడుగులు వేస్తున్నారు. సి.ఎం. ఆలోచనలకు అనుగుణంగానే విశాఖపట్నం మధురవాడలోని మిలీనియం టవర్స్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాపులుప్పాడ కొండపై సచివాలయం నిర్మాణం చేయడానికి సర్కార్ సన్నద్ధమైంది. కాపులుప్పాడ కొండ వున్న మొత్తం ప్రాంతాన్ని సచివాలయం తో పాటు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి వినియోగించాలని భావిస్తున్నారు. కాపులుప్పాడలో విశాలమైన కొండలు ఉన్నాయి. గతంలోనే రెవెన్యూ యంత్రాంగం 1300 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు గుర్తించింది. తాజాగా 250 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేసేందుకు, ముఖ్యంగా సెక్రటేరియట్ నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లును అధికారులు ఇక్కడి నుంచే చేస్తున్నారు.
సహజసిద్ధమైన ప్రకృతి సంపదకు కేంద్ర బిందువైన కాపులుప్పాడ ప్రాంతం భీమిలి ఏరియాలోనే ఉంది. ప్రస్తుతం 1350 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. 250 ఎకరాల విస్తీర్ణ స్థలంలో లేవుట్ వేయగా..175 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. ఇతర కొండలను చదును చేసి మరో 600 ఎకరాల భూమిని వినియోగంలోకి తీసుకరావాలని అధికారులు భావిస్తున్నారు.
అదానీ డేటా సెంటర్ కోసం కొండ దిగువ ప్రాంతంలో 175 ఎకరాలను ఎంపిక చేసి ఇక్కడ 'క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్'ను పెట్టాలని గతంలో నిర్ణయించారు. అయితే రూ.70 వేల కోట్ల పెట్టుబడితో అదానీ వస్తాడని ప్రణాళికలు వేయడం అత్యాశే అవుతుందని భావించి వైసిపి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను కొట్టిపడేసింది. ఎపిఐఐసి ఇదివరకే అదానీ గ్రూప్ సంస్థకు ఇచ్చేందుకుగానూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 175 ఎకరాలను ఆమోదించగా, వైసిపి ప్రభుత్వం అధికారానికి వచ్చాక రద్దు చేసింది.
ఇప్పటికే కొండలపై నీటి ట్యాంకులను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎపిఐఐసి ఇక్కడ రూ.100 కోట్లు ఖర్చు చేసి కొండలను చదును చేసింది.