English | Telugu

ఏపీ పోలీసుల మెడకు చుట్టుకున్న 151...

ప్రభుత్వానికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా సెక్షన్ 151 అంటే బాగా ఇష్ట పడుతున్నారని ప్రతి పక్షం ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి గురువారం విశాఖపట్నం విమానాశ్రయం బయట చంద్రబాబును అడ్డుకుని నగరంలోకి అడుగుపెట్టకుండా నిలవరించడంలో విజయం సాధించిన ఏపీ పోలీసులు ఈ క్రమంలో చేసిన సాంకేతిక తప్పు వల్ల హైకోర్టులో అడ్డంగా ఇరుక్కుపోయారు. సెక్షన్ 151 కింద మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భద్రత కోసమే అరెస్టు చేస్తున్నట్లు చేతితో రాసిన లేఖను చంద్రబాబుకు ఇచ్చిన పోలీసు అధికారులు చివరికి ఆ సెక్షన్ వల్లే హైకోర్టులో అడ్డంగా దొరికిపోయారు.

ఎలాగా.. అంటారా.. చంద్రబాబును అరెస్టు చేయడానికి తగిన కారణాలు ఆ సెక్షన్‌లో లేవని న్యాయనిపుణులు అంటున్నారు. శుక్రవారం నాడు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. హైకోర్టు కూడా ఈ విషయాన్ని ఆక్షేపించింది.. అక్షింతలు వేసింది.

ఈ లేఖను, అందులో పేర్కొన్న సెక్షన్ ను పిటిషనర్ కోర్టు ఎదుట ప్రస్తావించినప్పుడు.. కోర్టు అభ్యంతరాలు తెలిపింది. ఆ సెక్షన్ కింద నోటీసు ఇవ్వడం తప్పని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి నేరం చేయకుండా అదుపు చేసేందుకు మాత్రమే సెక్షన్ 151ని ఉపయోగించాలని.. డీసీపీ ఇచ్చిన నోటీసు ప్రకారం చూస్తే వ్యవహారం అలా కనిపించడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ చేసిన వాదన కూడా చంద్రబాబుకే అనుకూలంగా మారింది. ఆయన తన వాదనలో చంద్రబాబు భద్రత దృష్ట్యానే ముందస్తు నోటీసు ఇచ్చి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వాదనతోనే పోలీసులు ఇరుక్కున్నారు.దీనిపై పోలీసులు న్యాయస్థానంలో మరో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాల్సిఉంది. సోమవారం దీనిపై మళ్లీ విచారణ జరుగనుంది.

చంద్రబాబును విశాఖ విమానాశ్రయం వెలుపల అడ్డుకుని నిలవరించిన వందలాది మంది ఆందోళనకారులను చెదరగొట్టకుండా చంద్రబాబును ముందస్తు నిరోధక చర్య కింద అరెస్టు చేయడం ఏమిటని రాష్ట్ర హైకోర్టు ఆక్షేపించింది. చంద్రబాబును నిరోధించడంతో పాటు ఆయన్ని అడ్డుకున్న వారిని అడుపుచేసే పనిని పోలీసులు ఎందుకు చేయలేకపోయారని హైకోర్టు ప్రశ్నించింది. అధికార పక్షానికి ఒక రూల్, ప్రతిపక్షాలకు మరో రూల్ ఎలా ఉంటాయని వ్యాఖ్యానించింది.

తనను ఎందుకు అడ్డుకుంటున్నారో.. ఎందుకు వెనక్కు వెళ్లమంటున్నారో లిఖితపూర్వకంగా ఇస్తే తప్ప వెళ్లనంటూ రోడ్డుమీదే బైఠాయించిన చంద్రబాబుకు పోలీసులు అనాలోచితంగా ఇచ్చిన లేఖతో మొత్తం పరిస్థితులను తనకు అనుకూలంగా మల్చుకుని హైకోర్టులో తనకు అనుకూల వాదనలు వచ్చేలా చేసుకున్నారని న్యాయ నిపుణుల అంటున్నారు.

కరడుగట్టిన నేరస్తులను అదుపులోకి తీసుకోవడానికి ఉద్దేశించిన సెక్షన్ 151ని మాజీ ముఖ్యమంత్రిపై ప్రయోగించిన పోలీసులు తమ స్వయంకృతాపరాధం వల్లే న్యాయస్థానం ముందు నిలబడాల్సి వచ్చిందని, ప్రజలు మొత్తం గమనిస్తున్నారని, ఇప్పటికైనా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేయడం మానుకోవాలని తెలుగుదేశం నాయకులు సూచిస్తున్నారు.