English | Telugu

ఏపీ గవర్నర్ తో బీజేపీ, టీడీపీ నేతల భేటీలు.. ఫిర్యాదులు

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో టీడీపీ నేతల బృందం శనివారం ఉదయం భేటీ అయ్యింది. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై.. టీడీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఉన్నా, రాజకీయ కక్షతో అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో అలజడి రేపుతున్నారని మండిపడ్డారు. పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని కళా వెంకటరావు కోరారు.

మరోవైపు, గవర్నర్‌ బిశ్వభూషణ్ తో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడే రీతిలో రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఘర్షణ వైఖరిని అవలంభిస్తున్నాయని పేర్కొన్నారు. స్నేహపూర్వకమైన రాజకీయాలు ఉండాలే తప్ప.. ఇలాంటి ఘర్షణ వాతావరణం రాష్ట్రంలో నెలకొనడం బాధాకరమని అన్నారు. రోడ్లపైకి వచ్చి ఒకరినొకరు అడ్డుకోవడం సరికాదని హితవు జీవీఎల్ పలికారు.