English | Telugu
చట్టాల అమలుపై డీజీపీయే కోర్టుతో చెప్పించుకుంటే ఎలా?
Updated : Mar 12, 2020
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో హైకోర్టు డీజీపీని కోర్టుకి పిలిచి మరీ చివాట్లు పెట్టింది. ఇదేం పద్ధతి అంటూ డీజీపిని హైకోర్టు సూటి ప్రశ్నలతో క్లాస్ పీకింది. మీరు రాష్ట్రానికి డీజీపీ అన్న సంగతిని గుర్తుచేసింది. ఉదయం 10.25 గంటల నుంచి 4 గంటల వరకు కోర్టులోనే డీజీపీ పిలుపు కోసం నిరీక్షించారు. ఆయనతోపాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు కూడా కోర్టులోనే రోజంగా గడిపారు. ఈ నెలలో డీజీపీ కోర్టుకు హాజరు కావడం ఇది రెండోసారి.
CRPC 151 కింద నోటీసులు ఎలా ఇస్తారో వివరించాలని డీజీపీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై డీజీపీ నీళ్లు నమలగా CRPC 151 సెక్షన్ ఆర్డర్ చదవాలని జడ్జి ఆదేశించారు. ఆయన చదివి వినిపించారు. ఆ తర్వాత... ఆ సెక్షన్ కింద విశాఖ డీసీపీ ఇచ్చిన నోటీసును కూడా డీజీపీతో చదివించారు. అనంతరం, విచారణ ప్రారంభం అయింది.
చట్టాల అమలుపై సాక్షాత్తు డీజీపీయే కోర్టుతో చెప్పించుకుంటే ఎలా? అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మున్ముందు పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ జోక్యం తప్పదని, ఈ వ్యవహారాలపై తగు ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది
నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదని జడ్జి అడగగా, కోర్ట్ ఆదేశిస్తే చర్యలు తీసుకుంటామని డీజీపీ వివరించారు. తప్పుచేసిన పోలీసులపై చర్యలు తీసుకునేందుకు కోర్టు ఆర్డర్ అవసరంలేదని, మీరు ముందు చర్యలు తీసుకోండి మా నిర్ణయం మేము వెల్లడిస్తామని కోర్టు పేర్కొంది.
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఎందుకు రూల్ ఆఫ్ లాని పాటించలేదని, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయిలో CRPC 151 కింద నోటీసులు ఇచ్చారా అని నిలదీసింది. దీనిపై డీజీపీ మౌనమే సమాధానం ఇచ్చారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి పోలీస్, న్యాయ వ్యవస్థలు చట్టాన్ని న్యాయాన్ని మాత్రమే అమలుపరచాలన్న ధర్మాసనం పేర్కొంది. రూల్ ఆఫ్ లాని ఎందుకు అమలు చేయడంలేదంటూ ప్రశ్నించగా, డీజీపీ ఏదో చెప్పబోయారు. జడ్జి జోక్యం చేసుకొని రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144 పేరుతో వందలాది మంది పోలీస్ ల మోహరింపును ప్రస్తావించింది. రాజధానిలో కూడా మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఇకపై రూల్ ఆఫ్ లా తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. రూల్ ఆఫ్ లా పాటిస్తానని కోర్టుకు డీజీపీ తెలిపారు. ఈ కేసు విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ తన వాదన వినిపించేందుకు ప్రయత్నించగా కోర్టు సున్నితంగా తిరస్కరించింది. విశాఖలో ఏ అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను సీజే వాయిదా వేశారు.
విశాఖ ఉదంతం అనంతరం... చంద్రబాబుకు తగిన భద్రత కల్పించాలని, ఆయన పర్యటనలు, శాంతియుత నిరసనలు, సమావేశాలకు అనుమతి ఇచ్చేలా పోలీసుల్ని ఆదేశించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే టి.శ్రావణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇచ్చేందుకు హైకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ గౌతం సవాంగ్ గురువారం త్రిసభ్య ధర్మాసనం ముందు హాజరయ్యారు.
డీజీపీ వ్యవహారశైలిపై, కొంతమంది పోలీసు అధికారులు సైతం గుర్రుగా వున్నారు. డీజీపి నిర్ణయాలకు తాము న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తోందని అసహనంతో వున్నారు.