English | Telugu

తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్ మార్క్..! త్వరలోనే కొత్త ఈవో.!

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీటీడీని హ్యాండిల్ చేయడం పెద్ద తలనొప్పిగా మారిందట. పెద్ద సంఖ్యలో సిఫార్సులు రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం హిస్టరీలో ఎన్నడూలేనివిధంగా 36మందితో జంబో పాలక మండలిని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి... భవిష్యత్ లో ఎలాంటి వివాదాలు తలెత్తకుండా సమర్ధుడైన అధికారికి టీటీడీ పగ్గాలు అప్పగించాలని కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే టీటీడీ పాలక మండలిపై అనేక విమర్శలు, వివాదాలు చుట్టుముట్టడంతో, భవిష్యత్ లో అలాంటి పరిస్థితి తలెత్తకుండా చేయాలని జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా చంద్రబాబు హయాంలో నియమితులైన ప్రస్తుత టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను బదిలీ చేయనున్నారనే మాట వినిపిస్తోంది.

టీటీడీ కొత్త ఈవోగా జేఎస్వీ ప్రసాద్ ను నియమించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్నత విద్య మరియు స్కిల్ డెవలప్ మెంట్ శాఖలకు కార్యదర్శిగా ఉన్న జేఎస్వీ ప్రసాద్ వైపు సీఎం జగన్మోహన్ రెడ్డి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నిజాయితీపరుడు, సమర్ధుడిగా పేరున్న జేఎస్వీ ప్రసాద్ కు చంద్రబాబు హయాంలో సరైన ప్రాధాన్యత దక్కలేదని తెలుస్తోంది. బ్రాహ్మణుడైన ఈవోగా జేఎస్వీ ప్రసాద్ ను పశుసంవర్ధకశాఖకు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. దాంతో కొన్నాళ్లు సెలవులో వెళ్లిపోయిన జేఎస్వీ ప్రసాద్, ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవాలని భావించారు. అయితే, అంతలోనే ఎన్నికలు రావడం, జగన్ సీఎం కావడంతో... కీలకమైన ఉన్నత విద్య మరియు స్కిల్ డెవలప్ మెంట్ శాఖలకు కార్యదర్శిగా నియమితులైయ్యారు. అయితే, ఇఫ్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం పగ్గాలే ఆయనకు అప్పగించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

జేఎస్వీ ప్రసాద్ ను టీటీడీ ఈవోగా పంపిస్తే, తిరుమల తిరుపతి దేవస్థానంలో వివాదాలు-సమస్యలు సమసిపోతాయనే భావనలో జగన్ ఉన్నారట. దాంతో అతిత్వరలోనే ఉత్తర్వులు రానున్నాయని, ప్రస్తుత ఈవో సింఘాల్ బదిలీ ఖాయమని చెబుతున్నారు. అయితే, సింఘాల్ ను ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పంపిస్తారని తెలుస్తోంది. మరి, పది పదిహేను మంది ఉండే టీటీడీ బోర్డును హ్యాండిల్ చేయడమే అధికారులకు చాలా కష్టమని, అలాంటిది 36మంది బోర్డు మెంబర్స్ ను సంతృప్తిపర్చడమంటే అది కత్తి సామే అంటూ మాజీ ఈవోలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో... ముందుముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో..!