English | Telugu

మొన్న మెట్రో... ఇప్పుడు ఎక్స్ ప్రెస్-వే... భయపెడుతున్న ఫ్లైఓవర్లు...

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాం... అంతర్జాతీయస్థాయి స్టాండర్డ్స్ మెయింటైన్ చేశామంటూ గొప్పులు చెప్పుకుంటున్న హైదరాబాద్‌ మెట్రోరైల్ సంస్థ నిర్లక్ష్యానికి ఒకరు బలైపోయారు. నాసిరకం పనుల కారణంగా అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌లో పెచ్చులూడి మహిళ మృత్యువాత పడింది. దాంతో మెట్రోరైల్ పేరు చెబితేనే భయపడే పరిస్థితి వచ్చింది. వర్షం పడుతుందని... మెట్రో స్టేషన్ల కింద, మెట్రో ఫ్లైఓవర్ల కింద నిలబడటానికి జనం జంకుతున్నారు. ఎప్పుడు ఎక్కడ విరిగి మీద పడుతుందోనని హైదరాబాదీలు భయపడిపోతున్నారు. అసలు ఈ మెట్రోరైల్ సేఫేనా? మెట్రో స్టేషన్లు సురక్షితమేనా? అసలు ఇవి ఉంటాయా? లేక కూలిపోతాయా? అనే భయం వెంటాడుతోంది. కట్టి కనీసం ఏడాది కూడా కాకుండానే, అప్పుడే అలా పెచ్చులూడటమేంటి బాబోయ్ అంటూ వణికిపోతున్నారు.

మెట్రో పరిస్థితి ఇలాగుంటే, ఇప్పుడు మరో ఫ్లైఓవర్ భయపెడుతోంది. మెహిదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి వెళ్లడానికి పదేళ్ల క్రితం నిర్మించిన పీవీ ఎక్స్ ప్రెస్-వే కూడా పెచ్చులూడుతోంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ భారీ ఫ్లైఓవర్ మెయింట్ నెన్స్ ను హెచ్ఎండీఏ అధికారులు గాలికొదిలేయడంతో... పిల్లర్‌ నెంబర్‌ 20 దగ్గర వయాడక్ట్‌ పెచ్చులూడుతోంది. దాంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక, ఎక్స్ ప్రెస్ -వేపై గుంతల సంగతి చెప్పక్కర్లేదు. కనీసం మరమ్మతులు కూడా చేపట్టకపోవడంతో ఫ్లైఓవర్ కి పగుళ్లు ఏర్పడుతున్నాయి.

దాదాపు 12 కిలోమీటర్ల పొడవున్న ఈ పీవీ ఎక్స్ ప్రెస్-వే నుంచి నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటే, అదే సంఖ్యలో ఫ్లైఓవర్ కింద నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగిస్తుంటారు. అలాంటి అత్యంత కీలకమైన ఫ్లైఓవర్ మెయింటెనెన్స్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంపై హైదరాబాదీలు మండిపడుతున్నారు. ఫ్లైఓవర్ ను ఇలాగే వదిలేస్తే... ఏదైనా జరగకూడని ప్రమాదం సంభవిస్తే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగే ప్రమాదముందని, ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.