English | Telugu

కరోనా ఎగ్జిట్ అవగానే, వెలగపూడి నుంచి విశాఖకు... 

* రాజధాని తరలింపు పై సర్కారు పెద్దల సమాలోచన
* డిసెంబర్ వరకూ ఆగాలని ఒక పీఠాధిపతి సూచన
* అయితే, ఏప్రిల్ 28 తర్వాత, కాకపోతే డిసెంబర్ 25 న...
* తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో 'గండికోట రహస్యం'

ఇంతకీ ఏప్రిల్ 28 తర్వాతనా, లేక డిసెంబర్ 25 నా.... ఇవీ ఇప్పుడు తాడేపల్లి సి. ఎం. క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్న శషభిషలు... ఇదంతాకూడా రాజధాని మార్పు మీదనే అని వేరే చెప్పనవసరం లేదేమో.. కరోనా దెబ్బ కొట్టకపోతే, ఈ పాటికి రాజధాని విశాఖపట్నం షిఫ్ట్ అయ్యేదేమో.. అయితే, ఈ మహమ్మారి విసిరిన పంజాకు కుదేలైన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం,ఒక స్వామీజీ ( విశాఖ శ్రీ శారద పీఠాధిపతి కాదు) సలహా మేరకు కుదిరితే ఏప్రిల్ 28 తర్వాత , అంటే మే 2 వ తేదీ న, అదీ కాకపోతే క్రిస్మస్ రోజున , అంటే డిసెంబర్ 25 న రాజధాని ని తరలించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఈ శషభిషలన్నీ సి ఎం ఆంతరంగికుల మధ్యనే నడుస్తున్నాయని, ఐ ఏ ఎస్ ల అభిప్రాయాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడమేలేదని తాడేపల్లి, డోలాస్ నగర్ అభిజ్ఞ వర్గాల కథనం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల‌ని చట్టం చేసిన వైకాపా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది.

ముందుగా పాల‌నారాజధాని అయిన ‘విశాఖపట్నం’కు సచివాయాల‌న్ని తరలిస్తోందని, దీని కోసం ఏప్రిల్‌28 తరువాత ముహూర్తం పెట్టుకున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సచివాల‌య తరలింపు అంటే న్యాయస్థానాలు అడ్డంకులు సృష్టిస్తాయనే భావనతో ఉన్న వైకాపా పెద్దలు ఎటువంటి హడావుడి లేకుండా ముఖ్యమంత్రి కార్యాల‌యాన్ని ముందుగా ‘విశాఖపట్నం’లో ఏర్పాటు చేయబోతున్నారని ఆ వర్గాలు అంటున్నాయి. ఏప్రిల్‌ 28 తరువాత ‘కరోనా’ లాక్డ్‌డౌన్‌ ముగుస్తుందని, అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాల‌యాన్ని ‘విశాఖ’లో ప్రారంభించి ముఖ్యమంత్రిగా ‘జగన్‌’ అక్కడ నుంచే విధులు నిర్వహిస్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే దీనిపై వైకాపా పెద్దలు వ్యూహాన్ని రచించారని, దీని ప్రకారం ఏప్రిల్‌ నెలాఖరుకు ‘విశాఖ’కు సిఎంఒ కార్యాల‌యం తరలుతుందంటున్నారు. ఇప్పటికే పరిపాల‌నా రాజధానిని తరలించడానికి వైకాపా పెద్దలు గత మూడు నెల్లో మూడు ముహూర్తాలు పెట్టుకున్నారని, అయితే హైకోర్టు స్టే, అనుకోకుండా వచ్చిన ‘కరోనా’ వైరస్ వ‌ల్ల‌ ఆ మూహూర్తాల్లో అది సాధ్యం కాలేదని దీంతో దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల‌ కమీషనర్‌ను తొల‌గించిన ఊపులో రాజధాని విషయాన్ని కూడా తేల్చేయానే వారు భావిస్తున్నట్లు సమాచారం.

ఏప్రిల్‌28 తరువాత సిఎంఒ కార్యాయాన్ని తరలించి తరువాత ‘కరోనా’ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత మిగతా కార్యాల‌యాల‌ను అక్కడకు తీసుకెళ్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ, ఏప్రిల్ 28 తర్వాత ఫిక్స్ చేసిన మే 2 వ తేదీ ముహూర్తం సమయానికి లాక్ డౌన్ కంటిన్యూ అయ్యే పక్షం లో, డిసెంబర్ 25 చాలా అద్భుతమైన ముహూర్తం ఉందని, ఒక విశాఖేతర స్వామి ఈ ముహూర్తం ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. టీ టీ డీ సలహాదారు వెంకట రమణ దీక్షితులు డిసెంబర్ 25 ముహుర్తానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారని తిరుమల మాడ వీధుల సమాచారం. ఇందులో నిజమెంతో, ఆ గోవిందుడికే తెలియాలి.