English | Telugu

అందుకే మిమ్మల్ని కోర్టుకు పిలిపించాల్సి వచ్చింది

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టుకు హాజరయ్యారు. అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాలను తమకు అప్పగించడం లేదని పలువురు వాహనదారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. అయితే న్యాయవాది వాదనలతో సంతృప్తి చెందని న్యాయస్థానం.. డీజీపీని కోర్టుకు రావాలంటూ ఆదేశించింది. దీంతో, ఆయన ఈరోజు హైకోర్టుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కొందరు పోలీసు అధికారుల పని తీరు సరిగా లేదని వ్యాఖ్యానించింది. వాహనాల అప్పగింత జాప్యతపై డీజీపీని వివరణ అడగాలని అడ్వకేట్ జనరల్‌ ని తాము ఆదేశించామని.. అయితే, ఎక్సైజ్ ఏజీపీతో మెమో ఫైల్ చేయించారని పేర్కొంది. మీ న్యాయ సలహా విభాగం సరిగా పని చేయడం లేదని, ఈ కారణం వల్లే మిమ్మల్ని కోర్టుకు పిలిపించాల్సి వచ్చిందని డీజీపీని ఉద్దేశించి న్యాయమూర్తి అన్నారు.

సీజ్ చేసిన వాహనాల విషయంలో పోలీస్ అధికారులు నిబంధనలు పాటించలేదని న్యాయస్థానం పేర్కొంది. మూడు రోజుల్లోగా సీజ్ చేసిన వాహనాలను డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఎక్సైజ్ కమిషనర్ మూడు రోజుల్లో సీజ్ చేసిన వాహనాలపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.