English | Telugu
మందులు కొనాల్సిన డబ్బులతో కాస్మొటిక్స్ కొంటున్నారా?
Updated : Mar 11, 2020
ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అవినీతి జరిగినట్లు తెలిస్తే క్షమించే ప్రసక్తే లేదని అలాంటి వారు ఎవరైనా సరే విడిచిపెట్టేది లేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. అవినీతి ఉండకూడదని, వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలి ఆయన అధికారులకు సూచించారు.
అవినీతివల్ల పేదలైన కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, మందుల కొనుగోలులో పారదర్శకత ఉండాలన్నారు. రోగులకు మందులు కొనాల్సిన డబ్బులతో కాస్మొటిక్స్ కొనడం దారుణమని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కొనుగోలు చేసిన మందుల్లో జీఎంపీ ప్రమాణాలు ఉండాలని, ఈఎస్‌ఐ బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేయాలని పేర్కొన్నారు. వైద్యసేవల్లో నాణ్యత కోసం ఇప్పటికే కొన్ని ప్రమాణాలు నిర్దేశించుకున్నామని, ఆ ప్రమాణాలు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఉండేలా చూడాలని చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక బోధన ఆస్పత్రితో పాటు నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న బోధన ఆస్పత్రుల సంఖ్య 11 నుంచి 27కు పెంచుతున్నందునా పెద్ద సంఖ్యలో వైద్యులు ఈ కాలేజీల నుంచి వస్తారన్నారన్నారు. వీరి సేవలనుకూడా ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో వినియోగించుకునేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు.
వైద్య ఆరోగ్యశాఖతో అనుసంధానమై ఈఎస్‌ఐ ఆస్పత్రులను కూడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని, ఆసుపత్రితో సేవల మెరుగు కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. కాగా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పిన ఆయన కాలుష్య నివారణపైనా కూడా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.