English | Telugu
ఎపి బిజెపి పరిస్థితి దయనీయం!
Updated : Mar 7, 2020
రాజధాని మార్పుపై భిన్నాభిప్రాయాలే ఆ పార్టీ కొంప ముంచనున్నాయా?
అసెంబ్లీ ఎన్నికల్లో గెల్చుకున్న ఓట్లలో కనీసం సగమన్నా స్థానిక ఎన్నికల్లో బిజెపికి లభిస్తాయా?
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాజకీయ భవిష్యత్ దేవునిబిడ్డలా తయారైందని రాజధాని విషయంలో భారతీయ జనతాపార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ కుంప ముంచుతుందని బిజెపి అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అమరావతిపై ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా వుండటం రాష్ట్ర బిజెపి నేతలకు మింగుడుపడడం లేదు. అంతేకాదు, రాష్ట్రంలోని సొంత పార్టీ నేతలకు కూడా ఊహించని షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ పోతున్నారు జీవీఎల్.
తెలుగుదేశంపార్టీ నుంచి బిజెపిలో చేరిన సుజనా చౌదరి, వేరే రాష్ట్రం నుంచి ఎంపికైన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మధ్య ఎందుకు కోల్డ్ వార్ కొనసాగుతూ ఉంది. పరస్పరం వీరిరువురు రెచ్చిపోతూ భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఒకరి ప్రకటనలను మరొకరు పరోక్షంగా ఖండించుకుంటున్నారు. ఉన్నారు. వీరి గొడవ మధ్య రాష్ట్ర పార్టీ బలిఅయిపోతున్నా ఢిల్లీ పెద్దలు ఎందుకు మౌనంగా వున్నారనేది అర్థం కాక బిజెపి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట.
ఏపీకి రాజధానిగా అమరావతే ఉండాలంటూ సుజనా చౌదరి వాదిస్తున్నారు. అలాగే రాష్ట్ర బిజెపి నేతలు కూడా రాజధానిగా అమరావతే వుండాలని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. అమరావతి రైతులకు బిజెపిఅండగా వుంటుందని అమరావతిని కాపాడుకుని తీరతామంటూ స్థానిక నేతల ప్రకటనలు చేస్తున్నారు.
మరో ప్రక్క బిజెపి అధికార ప్రతినిధి కమ్ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాజధాని రాష్ట్రం పరిధిలోని అంశం అని తేల్చారు. ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోందంటూ పలు సార్లు ఆయన ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలు సుజనా చౌదరితో పాటు రాష్ట్ర బిజెపి పరువు తీసేలా వున్నాయి.
తను అధికార ప్రతినిధి హోదాలో మాట్లాడుతున్నట్టుగా పలు సార్లు జీవీఎల్ రెచ్చిపోతున్నారు. దీనిపై స్పందించిన సుజనా చౌదరి ఏ ఎల్లయ్యో.. పుల్లయ్యో చెబితే కాదు.. అంటూ జీవీఎల్ పై పరోక్ష వ్యాఖ్యానం చేశారు. దీనిపై జీవీఎల్ కూడా స్పందించారు. రాజధాని విషయంలో తను చెప్పింది పార్టీ వెర్షన్ అని ఆయన తేల్చారు.
నేతల గొడవలు ఎలా వున్నా స్థానిక ఎన్నికల్లో బిజెపి ఏ మేరకు తన అస్థిత్వాన్ని కాపాడుకుంటుందో వేచి చూడాలి.