English | Telugu

ఎపి శాసన మండలి ర‌ద్దుకు కేంద్రం ముహూర్తం పెట్టింద‌ట‌!

మండలి రద్దుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందన్న సంకేతాలు వ‌చ్చేశాయి. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీలుగా కొన‌సాగుతున్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావులకు రాజ్యసభకు అందుకే ఎంపిక చేసి పంపార‌ట‌.

శాసన మండలి రద్దు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదిస్తే వారిద్దరూ మాజీలు అవుతారు. మాజీలు కాక‌ముందే రాజ్య‌స‌భ‌కు ఎంపిక చేశారంటే త్వ‌ర‌లోనే శాస‌న‌మండ‌లి ర‌ద్ద‌యిపోతోంద‌ని అర్థం చేసుకోవ‌లంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తనకు అత్యంత విశ్వాసపాత్రులుగా వున్న‌ సీనియర్‌ నేతలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావులకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి రాజ్య‌స‌భ‌కు పంప‌డం మండ‌లి ర‌ద్దుతో లింక్ అయి వుంది.

వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీరికి మంత్రిపదవులు కేటాయించారు. ఆ తర్వాత. ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. ఇపుడు వైకాపా ప్రభుత్వం ఏపీ శాసనమండలిని రద్దు చేసింది. అందుకే రాజ్య‌స‌భ‌కు పంపారు.

ర‌ద్దు విషయం ఇంకా కొలిక్కి రాకమునుపే ఇద్దరు నేతలను రాజ్య‌స‌భ‌కు పంప‌డం అంటే మండలి రద్దుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందన్న సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అభ్యర్థన మేరకు పరిమళ్‌ నత్వానీకి రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించే అవకాశం కల్పించారు. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే, ఏపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయ‌డానికి ముహూర్తం కూడా ఖ‌రారుచేశార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.