English | Telugu

ఆర్టీసీ కొంప ముంచిన యస్‌ బ్యాంక్

క‌మీష‌న్ల‌కు క‌క్కుర్తిప‌డిన అధికారులు, రాజ‌కీయ‌పార్టీల నేత‌లు జాతీయ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను య‌స్‌కు మ‌ళ్ళించారు. అందాల్సిన వారికైతే క‌మీష‌న్లు ముట్టాయి కానీ ప్రజారవాణా శాఖకు చెందిన 240 కోట్ల రూపాయ‌లు బ్యాంక్‌లో ఇరుక్కుపోయాయి. ఏ నెలకు ఆ నెల అప్పులు తెచ్చుకుని బ‌స్సుల‌ను న‌డిపే పీటీడీకి 240 కోట్ల రూపాయలు బ్యాంక్‌లో వున్నా కేవ‌లం ఖాతాలో నుంచి 50 వేలు మాత్ర‌మే డ్రా చేసే దుస్థితి. బ‌స్సుల‌కు అవ‌స‌ర‌మైన డీజిల్‌ కొనుగోలుకు డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలి అధికారులు హైరానా ప‌డుతున్నారు.

యస్‌ బ్యాంక్‌ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ ప్రజా రవాణా వ్యవస్థపై పిడుగులా ప‌డింది. ఒప్ప‌ట్టి ఆర్‌టిసి, అదే ఇప్ప‌ట్టి పీ టీ డి ప్రజారవాణా శాఖ య‌స్ బ్యాంక్‌లో ఇరుక్కుని గిల‌గిల కొట్టుకుంటోంది. పీటీడీ విజయవాడలోని యస్‌ బ్యాంకు హెడ్‌ ఆఫీసులో అకౌంట్‌ ప్రారంభించి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తోం ది. ఎప్పుడూ ఓడీలు వాడుకునే సంస్థకు జనవరి 2020 నుంచి సిబ్బంది జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుండటంతో అకౌంట్లో నిధులు నిల్వచేసుకునే అవకాశం లభించింది.

జనవరి నెలకు సంబంధించిన జీతం ప్ర భుత్వం ఆర్టీసీకి ఫిబ్రవరిలో చెల్లించింది. ఈ డబ్బుల్లో నుంచి రూ.120కోట్లు యస్‌ బ్యాంకులోని ఆర్టీసీ ఖాతా లో జమ అయింది. దీంతోపాటు రోజువారీ కలెక్షన్ల డబ్బులు రూ.80కోట్లు ఏ రోజుకు ఆరోజు డిపాజిట్‌ చేశారు. సిబ్బంది జీతాల నుంచి రికవరీ చేసిన మరో 40కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇదే బ్యాంకులోని పీఎఫ్‌ ఖాతాకు బదిలీ చేశారు. దీంతో మార్చి మొదటి వారం ముగిసే నాటికి మొత్తం రూ.240కోట్లు యస్‌ బ్యాంకులో నిల్వఉంది.

ఈ పరిస్థితుల్లో బ్యాంకు ఆర్థిక ఇబ్బందుల్లో పడటం, ఖాతాదారులు ఏటీఎంలకు క్యూ కట్టడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. రోజువారి చెల్లింపుల్లో భాగంగా బ్యాంక్‌కు వెళ్లి న అధికారులకు బ్యాంకు సిబ్బంది ఇచ్చిన సమాధానం తో దిమ్మతిరిగింది. ‘మీ అకౌంట్‌ నుంచి 50వేల రూపాయలకు మించి తీసుకోవడం సాధ్యం కాదు’ అని చెప్పడంతో అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు.

జాతీయ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను ఇలాంటి బ్యాంకుల వైపు ఎందుకు మార్చారని తెలుగువ‌న్ అధికారుల‌తో ప్రస్తావించగా ‘వడ్డీకి ఆశపడి’ అంటూ ఆయన సమాధానం దాట‌వేశారు. ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు డిపాజిట్లకు తప్ప కరెంట్‌ అకౌంట్లకు వడ్డీ చెల్లించవు. యస్‌ బ్యాంకు అధికారులు ఆర్టీసీ అధికారులను సంప్రదించి కరెంట్‌ అకౌంట్‌ తమవద్ద ప్రారంభించాలని, రోజువారీ వడ్డీ చెల్లిస్తామని, అది కూడా 6.25శాతం ఇస్తామని ఆశ పెట్టడంతో వందల కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేశారు. ఇప్పుడు అసలుకే ముప్పు రావడంతో దిక్కుతోచని స్థితి.