English | Telugu
అమరావతిలో ఇక ఐదు జోన్లు
Updated : Mar 10, 2020
వెనుకబడిన వర్గాల ఇళ్ల నిర్మాణం కోసం రాజధాని అమరావతిలో కొత్తగా జోన్ ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి బృహత్ ప్రణాళిక(మాస్టర్‌ప్లాన్)లో కొన్ని మార్పులు చేశారు.
రాజధానిలో ఇప్పటివరకు 4నివాస జోన్లు ఉండేవి. కొత్తగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)/అందుబాటు ధరల్లో గృహ నిర్మాణ జోన్ ఆర్-5 ఏర్పాటు చేస్తూ సీఆర్‌డీఏ ముసాయిదా ప్రకటన విడుదల చేసింది.
రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా బదలాయిస్తున్నారు. అందులోని 900.97 ఎకరాలను ఆర్-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ తాజాగా మరో ముసాయిదా ప్రకటన వెలువడింది.
దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా తెలియజేయాలని సూచించింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిలో ఇంతవరకు ఆర్-1(ప్రస్తుత గ్రామాలు), ఆర్-2(తక్కువ సాంద్రత గృహాలు), ఆర్-3(తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు), ఆర్-4(హైడెన్సిటీ జోన్) పేర్లతో 4రకాల నివాస జోన్లు ఉండేవి.
ఆర్-5 జోన్‌లో అనుమతించే నిర్మాణాలు ఇలా వుంటాయి. ఒకదాన్ని ఒకటి అనుకుని నిర్మించిన గృహాలు(అటాచ్డ్), వేర్వేరుగా నిర్మించిన గృహాలు(డిటాచ్డ్), రో హౌసింగ్ అపార్ట్‌మెంట్లు, గ్రూప్ హౌస్‌లు.
ఏటీఎం వంటి ప్రజోపయోగ సదుపాయాలు, దుకాణా లు. హోం ఆఫీసులు, మత, ఆధ్యాత్మిక కేంద్రాలు. ఇలాంటి నిర్మాణాలను సీఆర్‌డీఏ నుంచి ముందస్తు అనుమతితో చేపట్టేందుకు వీలుంది.
సర్వీస్ అపార్ట్‌మెంట్లు, పారిశ్రామిక యూనిట్లు, ప్రింటింగ్ ప్రెస్‌లు, హైపర్‌మార్కెట్, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు ఈ జోన్‌లో అనుమతించరు.