English | Telugu

జనవరి నాటికి కరోనా వ్యాక్సిన్: ఎయిమ్స్ గుడ్ న్యూస్ 

మనదేశంలో కరోనా టీకా కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఆలిండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. డిసెంబర్ చివరికి లేదా జనవరిలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ తెలిపారు. కరోనా టీకా పరీక్షలు తుది దశకు చేరుకున్నాయని, అత్యవసర వినియోగానికి అనుమతులు లభించిన వెంటనే పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దానిని భద్రపరిచేందుకు అవసరమైన ఉష్ణోగ్రతలు, స్థలం, వ్యాక్సిన్ ఇచ్చే వారికి శిక్షణ, సిరంజిల లభ్యత వంటి వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏర్పాట్లు చేస్తున్నాయని డాక్టర్ రణ్‌దీప్ వెల్లడించారు.

కరోనా టీకా సేఫ్టీ, రియాక్షన్స్ పైనా ఎయిమ్స్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. కరోనాటీకాకు పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నప్పుడు అపశ్రుతులు సహజమేనని చెప్పారు. చెన్నైలో వ్యాక్సిన్ పరీక్షలో పాల్గొన్న ఓ వలంటీర్ అనారోగ్యానికి గురైనట్టు వచ్చిన వార్తలపైనా డాక్టర్ రణదీప్ స్పందించారు. అతడికి ఇతరత్రా కారణాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తి ఉండొచ్చని, టీకా వల్ల అయి ఉండదని అన్నారు. ఇప్పటి వరకు దాదాపు 80 వేల మంది వలంటీర్లకు టీకా ఇచ్చినా ఎవరిలోనూ ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదన్నారు. అయితే ఏదైనా వ్యాక్సిన్‌ను సుదీర్ఘకాలంపాటు తీసుకుంటే మాత్రం సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. మన దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు చెప్పిన డాక్టర్ గులేరియా.. మరో మూడు నెలల్లో పెద్ద మార్పు కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.