English | Telugu
స్వస్తిక్ మార్క్ ఉంటేనే వాలిడ్! ఎస్ఈసీ సర్క్యులర్ కొట్టేసిన హైకోర్టు
Updated : Dec 3, 2020
జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపు జరుగుతున్న సమయంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి ఎస్ఈసీ జారీ చేసిన సర్క్యులర్‌ను తోసిపుచ్చింది. బ్యాలెట్ పేపర్ల పై స్వస్తిక్ మార్క్ తప్ప మిగతా ఏదైనా పెన్ను మార్కు, ఇంకు మార్కు ఉంటే వాటిని వాలిడ్ ఓట్లుగా పరిగణించరాదని ఎన్నికల సంఘానికి తేల్చిచెప్పింది. కోర్టు తుది ఉత్తర్వులకు లోబడి గ్రేటర్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నిర్వహించాలని ఆదేశించింది. బ్యాలెట్ పేపర్‌లో పెన్ను మార్క్‌ను కూడా ఓటుగా పరిగణిస్తామని ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ పై బీజేపీ పార్టీ శనివారం ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది.
గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు ఉన్నవాటినే కాకుండా సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు ఓటింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని ఈసీ దృష్టికి తీసుకురావడంతో.. దానికి పరిష్కారంగా అలాంటి ఓట్లనూ లెక్కించాలంటూ ఆదేశాలిచ్చినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారదంటూ అధికారులు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్ఈసీ ఇచ్చిన ఆ సర్క్యూలర్ హైకోర్టు ఆదేశాలతో నిలిచిపోయింది.