English | Telugu

టీడీపీ, జనసేన వార్నింగ్ తో అలర్టైన జగన్... ఇసుక కొరతను తీర్చేందుకు కొత్త మార్గాలు

ఇసుక కొరతపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తుండటం, మరోవైపు టీడీపీ, జనసేనలు ఆందోళనలకు పిలుపునివ్వడంతో, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇసుక లభ్యతను పెంచేందుకు అధికారులతో చర్చించారు. అయితే, నదుల్లో ప్రవాహ ఉధృతి ఇప్పటికీ తగ్గకపోవడం వల్లే ఇసుక కొరత ఏర్పడిందని అధికారులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా 200కి పైగా ఇసుక రీచ్ లు ఉన్నప్పటికినీ కేవలం 69 చోట్ల మాత్రమే ఇసుక వెలికి తీయగలుగుతున్నామని వివరించారు. దాంతో, ముఖ్యంగా మూడు నెలల కాలానికి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్ణయించారు. వాగులు, వంకలు, చిన్న నదుల్లో కూడా ఇసుక రీచ్‌లను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించిన సీఎం జగన్‌.... గ్రామ సెక్రటేరియట్ల పర్యవేక్షణలో తవ్వకాలు జరపాలని సూచించారు. అలాగే 20 కిలోమీటర్ల పరిధిలోనే ట్రాక్టర్లు ద్వారా ఇసుక సరఫరాకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. అయితే, ఇసుక వినియోగదారులు తమ వ్యక్తిగత అవసరాలకు మించి ఇసుకను నిల్వచేయడానికి వీల్లేదని, ఒకవేళ ఎవరైనా నిల్వచేసే చర్యలు తీసుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.