English | Telugu

పశువులు, పక్షులు బలి! విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

ఎల్జీ పాలిమర్స్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్యాస్‌ లీకేజిపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున పశువులు మృత్యువాతపడ్డాయి. ఊపిరాడ‌క పాకల్లో కట్టేసి ఉన్న పశువులు.. పొలాల్లో ఉన్న పశువులు అక్కడే కుప్పకూలి పోయాయి. పక్షులు గాల్లోనే నుంచి కింద పడిపోయి విలవిల్లాడుతూ కొట్టుకుని చనిపోయాయి...LG పాలిమర్స్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి చుస్తే హృదయ విదారకంగా ఉంది.

ప్రజలు ఎక్కడికక్కడ పడిపోయారు. మరోవైపు.. పాలిమర్స్ చుట్టుపక్కల గ్రామాల్లోని చెట్లు మాడిపోయాయి.
ఇప్పటివరకూ 2వేల మందికి పైగా స్థానికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని అంబులెన్స్‌లు, ఆటోలు, కార్లలో ఆస్పత్రులకు తరలిస్తున్నారు. చుట్టు పక్కల నివాసముంటున్న ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని సైరన్‌లు మోగించి పోలీసుల హెచ్చరిస్తున్నారు. ప్రతి ఇంటినీ పోలీసులు, సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. మొత్తం 5 గ్రామాల ప్రజలు ఇళ్లు వదిలేసి బయటికొచ్చేశారు.