English | Telugu

హైద‌రాబాద్‌ కూర‌గాయ‌ల మార్కెట్‌లో దోపిడీ!

అతి ఆశ‌కు పోయిన‌ ఎర్ర‌గ‌డ్డ కూర‌గాయ‌ల మార్కెట్‌ వ్యాపార‌స్థుల‌కు ఘోర‌ప‌రాభ‌వం ఎదురైంది. క‌రోనా నేప‌థ్యంలో నాలుగు డ‌బ్బులు వెన‌కేసుకుందామ‌ని రేట్లు విప‌రీతంగా పెంచితే కొనుగోలు చేయ‌డానికి వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్లు ఇష్టం వ‌చ్చిన‌ట్లు త‌మ ద‌గ్గ‌ర వున్న సంచుల్లో ప‌ట్టిన‌న్ని కూర‌గాయ‌లు వేసుకొని వెళ్ళిపోయారాట‌. స‌డ‌న్‌గా జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌తో బిత్త‌ర‌పోయిన వ్యాపార‌స్థులు క‌నీసం త‌మ జేబుల్లో వున్న డ‌బ్బు పోకుండా చూసుకున్నార‌ట‌.

ష‌ట్‌డౌన్ నేప‌థ్యంలో ఎర్రగడ్డలో కూరగాయలు మార్కెట్లలో కూరగాయల ధరలు భారీగా పెంచేశారు. పదుల రేట్లలోని కిలో కూరగాయాలు వంద రూపాయలకు పైగా పెంచేయడంతో వినియోగ దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయ‌డంతో వ్యాపార‌స్థుల‌కు కొనుగోలుదారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ గొడ‌వ పెద్ద‌గా కావ‌డంతో వ్యాపారులపై వినియోగదారులు దాడికి దిగారు. ఇదే అదనుగా భావించి కొనుగోలుదారులు ఎక్కడికక్కడ అందినకాడికి కూరగాయలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో వ్యాపారులు షాక్‌కు గురైయ్యారు.