English | Telugu
ఒక్క టీచర్.. 25 స్కూళ్ళు.. 25 జీతాలు
Updated : Jun 5, 2020
ప్రభుత్వం రూపొందించిన ‘టీచర్స్ డిజిటల్ డేటా బేస్’లో ఒకే పేరు, అడ్రెస్ గల ఓ ఉపాధ్యాయురాలు ఒకటి కంటే ఎక్కువ పాఠశాలల్లో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కూపీ లాగితే, ఆమె 25 పాఠశాలల్లో పనిచేస్తున్నట్లు తెలిసి షాక్ అయ్యారు. ఆ టీచర్ పేరు అనామికా శుక్లా. ఆమె పనిచేస్తున్న స్కూళ్లన్నీ ప్రభుత్వ పాఠశాలలే. అన్నీ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ రెసిడెన్షియల్ స్కూళ్లే కావడం గమనార్హం.
ఒకే వ్యక్తి ఏకకాలంలో ఇన్ని పాఠశాలల్లో అటెండెన్స్ ఎలా మెయింటేన్ చేయగలిగారు? అన్నది ఇప్పుడు అధికారుల ముందున్న చిక్కు ప్రశ్న. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. అసలు ఆమె ఒరిజినల్ పోస్టింగ్ ఏ స్కూల్లో ఉందో కూడా తెలియని పరిస్థితి. దీనిపై అనామికను ప్రశ్నించడానికి ప్రయత్నించగా.. ఆమె తాను ఉంటున్న చిరునామా నుంచి పరారైంది. ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం యూపీలో ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. ఒకట్రెండు స్కూళ్లలో బయోమెట్రిక్ హాజరు మేనేజ్ చేయొచ్చని, ఇన్ని స్కూళ్లలో వేలిముద్రల విషయంలో ఎవరికీ అనుమానం రాలేదంటే, దీని వెనుక అధికారుల హస్తం ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.