English | Telugu

గమ్మున ఉండండి :- ఎన్నికల్లో ఓడిన నేతలకు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్

2018 ఎన్నికల తరువాత టీఆర్ఎస్ లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. అప్పటికే పదవిలో ఉన్న కొందరు నేతలతో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఓటమి పాలయ్యారు. ఆయా నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ పై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తరవాతి కాలంలో గులాబీ గూటికి చేరారు. నాటి నుంచి పార్టీలోకి వలసొచ్చిన ఎమ్మెల్యేలకి వారి చేతిలో ఓడిన నేతలకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. కొన్ని నియోజక వర్గాల్లో కొత్త , పాత నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతుంటే మరికొన్ని చోట్ల అంతర్గత గొడవలు కొనసాగుతున్నాయి.


ముఖ్యంగా తాండూరు, నకిరేకల్, పాలేరు, కొల్లాపూర్, మహేశ్వరం, వైర, పినపాక, ఎల్బీనగర్, ఎల్లారెడ్డి ఇల్లందు నియోజక వర్గాల్లో తాజా ఎమ్మెల్యేలకు గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్ధులకు అసలు పడటం లేదు. ఓడిన నేతలు.. టిక్కెట్లు దక్కని నేతలు.. టీఆర్ఎస్ క్యాడర్ తో సమావేశమవ్వటం ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఈ విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి వారు తీసుకెళ్లారు. ఎటువంటి హోదా లేని నేతలు నియోజకవర్గాల్లో రాజకీయాలు చక్కబెడుతుంటే ఎమ్మెల్యేగా తమ పరపతి దెబ్బతింటోందని అధిష్ఠానానికి విన్నవించుకుంటున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, పైలెట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జాజుల సురేందర్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి ఓడిన నేతలు మాజీ మంత్రులపై ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

దీంతో ఆయా నేతలను పిలిపించుకొని మంత్రి కేటీఆర్ మాట్లాడినట్లు గులాబి వర్గాలు చర్చించుకుంటున్నాయి. నియోజక వర్గాల్లో కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే సమావేశాలు నిర్వహించాలి కానీ మిగతా వారెవరూ నిర్వహించడానికి వీలు లేదంటూ అధిష్టానం స్పష్టం చేసింది. ఎవరికి వారుగా కార్యక్రమాలు చేస్తూ పోతే పార్టీ కేడర్ చీలిపోయే ప్రమాదముందని కూడా హెచ్చరించింది. నియోజకవర్గాల్లో మాజీలు, సీనియర్లు పర్యటనల కూడా చేపట్టవద్దని గట్టిగా సూచించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకా నాలుగేళ్ల పాటు కేడర్ తో మమేకం కాకుండా ఉంటే తమ భవిష్యత్ ముప్పు వాటిల్లుతుందని ఓడిన నేతలు బెంగటిల్లుతున్నారు. తాజాగా పార్టీ పెద్దలు ఇచ్చిన ఆదేశాల పై వారు మండిపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.