English | Telugu
కాచిగూడలో ప్రమాదం.. ఆగి ఉన్న రైలుని ఢీకొట్టిన మరో రైలు
Updated : Nov 11, 2019
హైదరాబాదులోని కాచిగూడ రైల్వే స్టేషన్ నింబోలి అడ్డ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలుని, ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 10 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
సిగ్నల్ లోపమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్ వస్తున్న హంద్రీ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ స్టేషన్ వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉంది. అయితే సిగ్నల్ లోపం వల్ల అదే ట్రాక్‌పై ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు వచ్చింది. హంద్రీ ఎక్స్‌ప్రెస్ ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఎంఎంటీఎస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పి.. పక్క ట్రాక్ మీదకు ఒరిగాయి. దీని కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎంఎంటీఎస్ రైలు వేగం తక్కువ ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. రైల్వే అధికారులు హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు.