English | Telugu
3 రాజధానులతో ప్రజలకు లాభమా? నష్టమా?
Updated : Dec 18, 2019
అధికార వికేంద్రీకరణ... మూడు రాజధానులు... అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి... సెక్రటేరియట్ ఒక చోట... హైకోర్టు మరో చోట... అసెంబ్లీ ఇంకో చోట... ఇలాంటి మాటలు చెప్పడానికి... వినడానికి బాగానే ఉంటాయి... కానీ వాస్తవంలో మాత్రం ప్రజలకు కష్టాలు తెచ్చిపెడతాయి. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్.... కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్.... అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్.... ఇలా ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి సంకేతాలిచ్చినా ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగమనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే, అధికార వికేంద్రీకరణ విధానం మంచిదంటూ స్టేట్ మెంట్ ఇచ్చినంత ఈజీగా ప్రజలకు మేలు జరగనే జరగదు. అందుకే, జగన్ చెప్పిన మూడు ప్రాంతాలు ...రాజధానులుగా ప్రజలకు ఎంతవరకు సౌలభ్యమనేది ఆలోచించారు. ఎందుకంటే, రాజధాని అనేది అన్ని ప్రాంతాలకు దాదాపు సమాన దూరంలో సెంట్రల్ పాయింట్ లో ఉంటేనే అందరికీ సౌలభ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే, విశాఖ, కర్నూలు... ఈ రెండూ కూడా కశ్మీరూ... కన్యాకుమారి మాదిరిగా ఒకటి మ్యాప్ లో మొదట ఉంటే.... రెండోది చివర్లో ఉన్నట్లు ఉంటాయి.
అమరావతి-విశాఖ మధ్య దూరం 352 కిలోమీటర్లు.... అలాగే, అమరావతి-కర్నూలు మధ్య దూరం 342 కిలోమీటర్లు... అంటే, అమరావతి నుంచి విశాఖ మధ్య దూరం ఎంతుందో.... అమరావతి నుంచి కర్నూలు మధ్య డిస్టెన్స్ కూడా దాదాపు అంతే ఉంది. దాంతో, అమరావతి నుంచి కర్నూలు వెళ్లాలన్నా.... విశాఖ వెళ్లాలన్నా.... ప్రమాణ సమయం రెండింటికీ దాదాపు ఏడెనిమిది గంటలే పడుతుంది. అయితే, విశాఖ నుంచి కర్నూలు రావాలన్నా..... కర్నూలు నుంచి విశాఖ వెళ్లాలన్నా.... సుమారు 15గంటల సమయం పడుతుంది. దాంతో, కోర్టు పనుల కోసం ఉత్తరాంధ్ర ప్రజలు కర్నూలు రావాలన్నా.... రాయలసీమ ప్రజలు సెక్రటేరియట్ కోసం విశాఖ వెళ్లాలన్నా ...చాలా వ్యయప్రయాసలు తప్పవు. ఎందుకంటే, విశాఖ - కర్నూలు మధ్య దూరం 691 కిలోమీటర్లు. అంటే, ప్రయాణానికే దాదాపు ఒకరోజు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఇది, చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నదే కాకుండా ప్రజలరు తమ విలువైన సమయాన్ని కూడా కోల్పోతారు.
మూడు రాజధానుల ప్రతిపాదన వినడానికి బాగానే ఉన్నా... ఆచరణలో మాత్రం వ్యయభారం, కాలాతీతంతో ప్రజలకు కష్టాలు తెచ్చే అవకాశముంది. ఎవరైనా ఒక వ్యక్తి మూడు రాజధానుల్లో పనులు చక్కబెట్టుకోవాలంటే విలువైన సమయాన్నీ, సొమ్మునీ కోల్పోక తప్పదు. అయితే, అటు ఉత్తరాంధ్రకు.... ఇటు రాయలసీమకు సమాన దూరంలోనూ... రాష్ట్రానికి సెంట్రల్ పాయింట్ గా ఉండే అమరావతే... ఏపీకి రాజధానిగా ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని అంటున్నారు.