English | Telugu
రాపాక మాస్టర్ ప్లాన్.. జనసేన నుండి సస్పెండ్ అవ్వడానికే ఇష్టానుసార వ్యాఖ్యలు!!
Updated : Dec 18, 2019
తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు ఎస్సీ రిజర్వు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరావు ఎన్నికయ్యారు. జనసేన నుంచి మొత్తం రాష్ట్రంలోనే ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక. అయితే ఇప్పుడాయన తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీ నుంచి సస్పెండ్ కావాలని చూస్తున్నారు. జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరితే కొత్త చిక్కులు వచ్చిపడతాయని భావిస్తున్నారు. అధికార వైసీపీలో చేరదామా అంటే రాజీనామా చేసి రావాలని షరతు పెట్టారు. రాజీనామా చేసి మరోసారి ఎన్నికలకు వెళ్లి రిస్క్ చేయడం రాపాకకు అస్సలు ఇష్టం లేదు. తన గెలుపుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జనసేనను వీడి వైసీపీలో చేరి పోయారు. ఫలితంగా రాపాక రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. మరోవైపు తన ప్రత్యర్థి బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని రాపాక ఎన్నిక చెల్లదని హై కోర్టులో రిట్ వేశారు. రాపాక అనుచరులపై కేసులు పెట్టించి ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపై ఎమ్మెల్యే పలు సందర్భాల్లో ఆరోపణలు సైతం చేశారు. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు వైసీపీకి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు రాపాక.
సీఎం జగన్ జిల్లాలో పాల్గొనే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఎం జగన్ చిత్రపట్టానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై విమర్శలు చేస్తున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే రాపాకకు మధ్య దూరం పెరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనే రాపాక ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. పవన్ మండపేటలో రైతు సమస్యలు తెలుసుకోవడానికి చేపట్టిన పర్యటనలో రాపాక పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలు కావడం టిడిపి సస్పెండ్ చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సభలో ప్రత్యేక సభ్యుడిగా స్పీకర్ తమ్మినేని సీతారాం గుర్తించడంతో రాపాకలో మార్పు వచ్చింది.పవన్ కల్యాణ్ కాకినాడలో చేపట్టిన జనసేన రైతు సౌభాగ్యం దీక్షకు రాపాక గైర్హాజరయ్యారు. దీనిపై పవన్ కళ్యాణ్ సీనియర్ నాయకులతో సీరియస్ గానే చర్చించారు. రాపాక మరో అడుగు ముందుకు వేశారు. ఏకంగా జనసేనకు భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. ఇలాగే ఉంటే జనసేనలో కొనసాగడం కష్టమని తేల్చి చెప్పారు. నెలకొకసారి అధినేత పవన్ కల్యాణ్ జనాల్లోకి వస్తానంటే పార్టీకి భవిష్యత్తు ఉండదు అంటూ రాపాక చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే హాట్ టాపిక్ గా మారాయి. అప్పుడప్పుడూ కనిపించి వెళ్ళిపోడానికి ఇది సినిమా కాదని ఏకంగా అధినేతపైనే మీడియా ముందు విమర్శలు సంధించారు. సీఎం పదవిపై వ్యామోహం లేదని పవన్ వ్యాఖ్యానించటం వల్లే ప్రజల్లో నమ్మకం పోతుందని అన్నారు. జగన్ లాగా కష్టపడితేనే జనసేనకు భవిష్యత్తు ఉంటుందని చెప్పారు.
అయితే ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు జనసేన నుంచి సస్పెన్షన్ కు గురి కావడం కోసమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజోలులో జనసేన కార్యకర్తలు కొందరు దూరమైనా సామాజిక వర్గం మద్దతు ఉంటుంది అనేది రాపాక ఆలోచన. ప్రత్యేక సభ్యుడిగా ఉంటే వైసీపీ ప్రభుత్వానికి దగ్గరగా ఉండొచ్చని వైసీపీ ఎమ్మెల్యేలా కొనసాగవచ్చనే ఉద్దేశంతో రాపాక ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈనేపధ్యంలో రాజోలులో రాజకీయ పరిణామాలు మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తో రాజకీయ విభేదాలు కొనసాగిస్తున్న వైసీపీ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావును ఆ పార్టీ అధిష్ఠానం బాధ్యతల నుంచి తప్పించేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గా పని చేసి రాజకీయాల్లోకి వచ్చిన రాజేశ్వరరావు త్వరలోనే రాజోలు నుంచి అమరావతికి వెళ్ళబోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబోయే ఓ కమిటీ లోకి ఆయనను తీసుకుంటున్నారు. తద్వారా జనసేన ఎమ్మెల్యే రాపాకకు స్థానికంగా వైసీపీ నాయకులతో గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉండదని అనుకుంటున్నారు. ఇక పై ఆయన అనధికారికంగా అధికార పార్టీ ఎమ్మెల్యే అయినట్లే అని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు.