English | Telugu
తప్పుల తడకగా ఇంటర్ క్వశ్ఛన్ పేపర్లు.... విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుకున్న ఇ
Updated : Mar 18, 2020
మార్చి నెల 4వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఫస్టియర్ పరీక్షకు 4,80,531 మంది, సెకండియర్ పరీక్షకు 4,85,345 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే తెలంగాణా ఇంటర్ బోర్డు లీలలు చూసి విద్యార్థులు, వారి తలిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ క్వశ్చన్ పేపర్లను చూసినట్లైతే ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి పరాకష్టగా కనిపిస్తోంది. ఫస్టియర్, సెకండియర్ తేడా లేకుండా ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ మిస్టేక్స్ కనబడ్డాయి. అక్షరాల్లో తప్పులు, ఒక పదానికి బదులు ఇంకో పదం అచ్చవడం, వాక్య నిర్మాణాల్లో లోపాలతో స్టూడెంట్లు బేజారయ్యారు.
ఇప్పటివరకూ జరిగిన ప్రతి క్వశ్చన్ పేపర్లోనూ తప్పులొచ్చాయి. కొన్ని చిన్న తప్పులైతే, ఇంకొన్ని ప్రశ్న అర్థాన్నే మార్చేశాయి. ఈసారి ఇంగ్లిష్ పేపర్–2తో ఎక్కువ తప్పులొచ్చాయి. 17వ తేదీ జరిగిన ఫస్టియర్ కామర్స్ పేపర్లోనూ చాలా తప్పులొచ్చాయి. ఇంగ్లిష్ –2 పేపర్లో 14వ ప్రశ్నను అటెంప్ట్ చేసిన వాళ్లకు 4 మార్కులు కలపాలనుకుంటున్నట్టు బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ చెప్పారు.
సంస్కృతం సెకండియర్ పేపర్లో 13వ ప్రశ్నలో బిట్నెంబర్ 1లో హారిస్‌కు బదులు హరిసా అని పడింది. 15వ క్వశ్చన్‌లో బిట్ నెంబర్ 1లో యథాశక్తికి బదులు యసశక్తి అని ప్రింట్ అయి వుంది.
సెకండియర్ ఇంగ్లిష్ పేపర్ -2లో 5వ ప్రశ్నలో బిట్ నెంబర్ ఏలో WHY బదులు WHAT అని వచ్చింది. 7వ ప్రశ్నలోని పేరా2లో DISCIPLINE కు బదులుగా DISIPLINE అని,12వ క్వశ్చన్ లో TURN A DEAF EAR బదులు TURN TO DEAF YEAR అని పడింది. 17వ ప్రశ్నలో FELICITATION బదులుగా FELICILATION అని వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 14 కూడా బ్యాంక్ వివరాలు లేకుండానే బ్యాంకు వివరాలివ్వాలని ప్రశ్నను అసంపూర్తిగా ఇచ్చారు. 10వ ప్రశ్న బిట్ నెంబర్ 1 కూడా తప్పుగా వచ్చింది.
ఫస్టియర్ బాటనీ -1 ఉర్దూ మీడియంలోని 6వ ప్రశ్నలో మాష్మియాట్కు బదులు షామియాట్ అని వచ్చింది. 13వ ప్రశ్నలో సన్ఫీకి బదులు మన్ఫీ అని వచ్చింది.
సెకండియర్ బాటనీ ఉర్దూ మీడియం పేపర్లో 2వ ప్రశ్నలో షరీక్ ఆమీల్కు బదులు షరీక్ మిల్ అని వచ్చింది.13వ ప్రశ్నలో జాడ్ కరీచికి బదులు జాడ్ కార్తీచి అని ఉంది.
సెకండియర్ హిస్టరీ తెలుగు మీడియం పేపర్లో 8వ ప్రశ్నలో కుతుబ్‌షాషీ పేరుకు బదులు తుక్కుబ్ షాహీ అని వచ్చింది. హిస్టరీ ఉర్దూ మీడియంలో 33వ ప్రశ్నలో షరీఫానాకు బదులు ముష్రిఫానా అని వచ్చింది.
ఫస్టియర్ ఎకనామిక్స్ తెలుగుమీడియంలో 4,15 ప్రశ్నల్లో జాతీయ ఆదాయానికి బదులు జాతీయదన్ని అని పడింది. 23వ ప్రశ్నలో వెబ్లిన్కు బదులు వెబ్లెన్ అని ఉంది.
ఎకనామిక్స్ ఉర్దూ మీడియం(ఓల్డ్) 8వ ప్రశ్నలో ముతానియత్కు బదులు ముస్తాన్నియత్ అని, 13వ ప్రశ్నలో ‘బార్డర్ నిజాం కియాహై’ కి బదులు బజార్‌కి దర్జా బండికి వాజహత్ కిజియే అని పడింది.
సెకండియర్ ఫిజిక్స్ తెలుగు మీడియం పేపర్లో 2వ ప్రశ్నలో అనిశ్చితత్వకు బదులు అనిచ్చితత్వ సూత్రం అని వచ్చింది.
ఫస్టియర్ కెమిస్ర్టీ తెలుగు మీడియంలో 15వ ,16వ ప్రశ్నల్లో, ఇంగ్లిష్‌మీడియంలో 14వ ప్రశ్నలో తప్పులొచ్చాయి. కామర్స్ పేపర్లో (న్యూ) ఇంగ్లిష్ మీడియంలో 27వ ప్రశ్న, తెలుగు మీడియంలో 16వ ప్రశ్నలో తప్పులు దొర్లాయి. కామర్స్ (ఓల్డ్) తెలుగు మీడియంలో 18, 19, 22, 23, 31వ ప్రశ్నల్లో తప్పులొచ్చాయి.
ఇంటర్ పరీక్షల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిన అధికారులపట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యార్థుల తలిదండ్రులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.